రైలులో నిద్రించిన వృద్ధురాలు

10 Jun, 2020 07:19 IST|Sakshi
కస్తూరి 

కేరళకు వెళ్లిన వైనం 

మెంటల్‌ హాస్పిటల్‌లో చేర్పించిన అధికారులు 

80 రోజుల తరువాత కుమార్తె చెంతకు

సాక్షి, తమిళనాడు‌: చెన్నై నుంచి రైలులో మదురై వస్తుండగా నిద్రించిన వృద్ధురాలు కేరళ రాష్ట్రం చేరుకుంది. అక్కడ మెంటల్‌ హాస్పిటల్‌లో 80 రోజుల నిర్బంధం తర్వాత కుమార్తె చెంతకు చేరింది. వివరాలు.. మదురై అరప్పాళయం ప్రాంతానికి చెందిన కస్తూరి (70). ఈమె కుమార్తె శ్రీప్రియ చెన్నైలో ఉంటున్నారు. ఈమెను చూసేందుకు కస్తూరి చెన్నైకు చేరుకున్నారు. ఇక్కడి నుంచి మళ్లీ మార్చి 18వ తేది మదురైకు బయలుదేరారు. మదురై చేరుకున్న సమయంలో ఆమె నిద్రించడంతో రైలు కేరళ రాష్ట్రంలోని కొల్లంకు చేరుకుంది. అక్కడ అందరూ ఆమెను దిగమని చెప్పడంతో కస్తూరి లేచి ఇది మదురై కాదా! అంటూ దిక్కులు చూసింది.

ఆమె వద్ద కేరళ పోలీసులు మలయాళంలో విచారణ జరపగా ఆమెకు అర్థం కాలేదు. పోలీసులకు ఆమె తమిళం తెలియలేదు. ఇలా ఉండగా కేరళలో కరోనా వైరస్‌ మొట్టమొదటగా ప్రవేశించినందున రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. దీంతో వద్ధురాలిని మతిస్థిమితం లేని మహిళగా భావించి, ఆమెను మానసిక చికిత్సా కేంద్రంలో చేర్చారు. ఇలా ఉండగా శ్రీప్రియ తల్లికోసం 80 రోజులుగా గాలింపులు చేపడుతూ వచ్చింది. రెండు రోజుల క్రితం కేరళ నుంచి శ్రీప్రియకు ఒక ఫోన్‌ కాల్‌ అందింది. అందులో తన తల్లి కేరళ కోలికోడ్‌ మెంటల్‌ హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయినట్టు తెలిసింది. చదవండి: 11 నెమళ్లకు విషం పెట్టి చంపేశారు 

దీంతో తల్లిని విడిపించాల్సిందిగా మదురై కలెక్టర్‌ వినయ్‌కు శ్రీప్రియ విజ్ఞప్తి చేసింది. కోలికోడ్‌ కలెక్టర్‌తో మదురై కలెక్టర్‌ ఫోన్‌లో సంప్రదించి కస్తూరిని సోమవారం మదురైకు రప్పించారు. కలెక్టర్‌ సమక్షంలో అధికారులు శ్రీప్రియకు తల్లిని అప్పగించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మదురై రెడ్‌క్రాస్‌ నిర్వాహకులు చేశారు. శ్రీప్రియ మాట్లాడుతూ బాగున్న తల్లిని మతిస్థిమితం లేనట్లు కేరళ ఆసుపత్రిలో 80 రోజులు నిర్భంధించడం ఆవేదన కలిగిస్తున్నదని కన్నీటి పర్యంతం అయ్యారు.

మరిన్ని వార్తలు