రూ. 1 తగ్గింది !

8 Jan, 2015 01:51 IST|Sakshi

సగటున 5 శాతం మాత్రమే  తగ్గిన బస్సు ఛార్జీలు
శుక్రవారం అర్థరాత్రి నుంచి అమలు
ఇంతకంటే తగ్గించడం కుదరదన్న మంత్రి

 
బెంగళూరు:రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థలోని నాలుగు విభాగాల బస్ చార్జీలను తగ్గిస్తూ రాష్ర్ట ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తగ్గిన బస్సు చార్జీలు అమలు కానున్నాయి. సగటున 5 శాతం కంటే తక్కువగా ఈ తగ్గింపు ఉండడంతో పలువురు విమర్శలు చేస్తున్నారు. ధరలు పెంచే సమయంలో గరిష్టంగా 20 శాతం పెంచే ప్రభుత్వం తగ్గింపులో మాత్రం ఉదారస్వభావాన్ని కనబరచకపోవడాన్ని రవాణాశాఖ అధికారులు తప్పుబడుతున్నారు. ఛార్జీల తగ్గింపు ధరలకు సంబంధించిన  వివరాలను రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి మీడియాకు వివరించారు. బీఎంటీసీ సంస్థలో మొదటి స్టేజ్‌కు రూ.1, అటుపై 9,12,13, 16,17,18, 19,22,23 స్టేజ్‌లకు రూపాయి చొప్పున టికెట్టు ధరలు తగ్గాయి. అంటే రెండు నుంచి ఎనిమిది స్టేజీల మధ్య ఎటువంటి తగ్గింపు లేదు. కేఎస్‌ఆర్టీసీ, ఎన్‌డబ్యూకేఆర్టీసీ, ఎన్‌ఈకేఆర్టీసీ విభాగాల్లోని  ఆర్డినరీ సర్వీసుల్లో సబ్‌స్టేజ్ 2 (2ఎస్) రెండు రూపాయల తగ్గింపు. 4,6,7,8,12,13,14,15,16,17 స్టేజీలకు రూ.1 తగ్గించారు.

 సిటీ/సబ్-అర్బన్ సర్వీసుల్లో 1,2,13 స్టేజీలకు రూపాయి తగ్గించారు. స్టేజీ 3కు రెండు రూపాయలు తగ్గించారు. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో  కనిష్టంగా రూ.1 గరిష్టంగా రూ.11 తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలవారి, వికలాంగులు, వృద్ధులు తదితర పాసు ధరల్లో మార్పులేదు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని ధరలను తగ్గించామని, ఇంతకు మించి ఎక్కువ తగ్గించలేమని మంత్రి స్పష్టం చేశారు.
 
 

మరిన్ని వార్తలు