కాంగ్రెస్‌లో మరోసారి భగ్గుమన్న అసమ్మతి

21 Aug, 2015 01:42 IST|Sakshi

సిద్ధరామయ్య వైఖరిపై ఎస్.ఎం.కృష్ణ పరోక్ష వ్యాఖ్యలు
 స్వరం కలిపిన బి.కె.హరిప్రసాద్
 

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి సెగలు మరోసారి భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అటు ప్రభుత్వంతో పాటు ఇటు పార్టీలోనూ అన్నీ తానై వ్యవహరిస్తున్న తీరుపై చాలా కాలంగా కాంగ్రెస్ సీనియర్ నేతల్లో అసమ్మతి చెలరేగుతూనే ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ గురువారమిక్కడ చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి దేవరాజ్ అరస్ శత జయంతి వేడుకల సందర్భంగా గురువారమిక్కడి కేపీసీసీ కార్యాలయంలో నిర్విహించిన కార్యక్రమంలో ఎస్.ఎం.కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....‘ఇప్పుడు నాకు 83ఏళ్ల వయస్సు, అయినా ఇప్పటికీ నేనింకా ఏదో నేర్చుకోవాల్సి ఉందనే భావిస్తుంటాను. అంతేకాదు నేను నేర్చుకోవాల్సింది కూడా చాలానే ఉంది. అయితే కొంత మంది మాత్రం నాకు అంతా తెలుసు, నేను ఎవరి  నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ ‘అహం బ్రహ్మాస్మి’ అంటూ ప్రవర్తిస్తున్నారు. పాలన సాగించే నేతలకు ఈ తరహా వైఖరి ఉండడం ఏమాత్రం సరికాదు’ అంటూ సిద్ధరామయ్య పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ఈ మధ్యకాలంలో పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి సిద్దరామయ్య సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, హైకమాండ్ కూడా సిద్ధరామయ్య వైఖరి పట్ల అభ్యంతరం చెప్పక పోవడంతో ఎస్.ఎం.కృష్ణ తన అసహనాన్ని ఈ విధంగా ప్రదర్శించారనేది రాజకీయ విశ్లేషకుల వాదన. ఇక ఇదే సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బి.కె.హరిప్రసాద్ సైతం ఎస్.ఎం.కృష్ణ వ్యాఖ్యలకు స్వరం కలిపారు. ‘కొంతమంది అధికారానికి రాక ముందు ‘సమానత్వం’ గురించి మాట్లాడతారు. కానీ అధికారం చేతికి వచ్చిన తర్వాత మాత్రం కేవలం తమ జాతి వరకు మాత్రమే పరిమితమౌతారు. అధికారం చేతికి వచ్చిన తర్వాత కేవలం తమ జాతి వరకు పరిమితమవడం ఎంతమాత్రం సరికాదు’ అంటూ సిద్ధరామయ్యపై చురకలు విసిరారు. ఇక సిద్ధరామయ్య వైఖరి పట్ల అసంతృప్తి కారణంగా బీబీఎంపీ ఎన్నికల ప్రచారానికి ఎస్.ఎం.కృష్ణ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే భుజాలకెత్తుకున్నారు. ఈ సందర్భంలో బీబీఎంపీ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పరాజయం పాలైతే సిద్ధరామయ్యపై అసంతృప్తి మరింత అధికమయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు