శశాంక్‌.. 12 ఏళ్లకే ఎస్‌ఐ

25 Jul, 2018 11:12 IST|Sakshi
కొత్త ఎస్‌ఐకి సెల్యూట్‌

విధివంచిత బాలునికి ‘ఒక్కరోజు’ అవకాశం  

12 ఏళ్ల బాలుడు శశాంక్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అయ్యాడు. అక్రమ మద్యం, నేరాలను నిరోధించాలని కానిస్టేబుళ్లకు కఠిన ఆదేశాలు ఇచ్చాడు. అలాగే సార్‌.. అని వారుఅణకువతో సెల్యూట్‌ కొట్టారు. ఆనందంతో చిన్నారి తల్లి కంట కన్నీరు ఆగలేదు.

బనశంకరి: నయం కాని జబ్బులతో బాధపడుతున్న శశాంక్‌ అనే బుడతని ఆకాంక్షను పోలీసులు పెద్దమనసుతో తీర్చారు. బెంగళూరు విశ్వేశ్వరపురం పోలీస్‌స్టేషన్‌లో ఒక్కరోజు ఎస్‌ఐ అయ్యారు. వివరాలు.... చింతామణి నారాయణహళ్లి గ్రామానికి చెందిన మునిరాజ్, సుజాత దంపతుల కుమారుడు శశాంక్‌ ప్రభుత్వ పాఠశాలలో 7 తరగతి చదువుతున్నాడు. అతడు 5 నెలల పసికందుగా ఉన్న సమయంలోనే తలస్సేమియా జబ్బు తలెత్తింది. రెండేళ్ల నుంచి మధుమేహం కూడా పీడిస్తోంది. రెండు జబ్బులతో నగరంలోని వాణివిలాస్‌ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నాడు. శశాంక్‌కు బాగా చదివి పోలీసు కావాలనే కోరిక ఉంది. కానీ అనారోగ్యంతో చదువు సాగడం లేదు. 

కోరిక తీరిందిలా
బాలుని ఆశను మేక్‌ ఏ విష్‌ పౌండేషన్, వాణివిలాస్‌ ఆసుపత్రి ప్రతినిధులు నేరవేర్చాలని తీర్మానించారు. మంగళవారం విశ్వేశ్వరపురం పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ అయ్యే అవకాశం కల్పించారు. ఆ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ రాజు మంగళవారం ఉదయం 9.30 గంటలకు బాలుడు శశాంక్‌కు ఎస్‌ఐగా అధికార బాధ్యతలు అప్పగించారు.  పోలీస్‌ యూనిఫాంలో వచ్చిన శశాంక్‌కు పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టగానే అన్ని కేసుల వివరాలను ఎస్‌ఐ శశాంక్‌ పరిశీలించారు. ఫైళ్లను చూసి పెండింగ్‌ కేసుల గురించి ఆరా తీశారు. పోలీస్‌స్టేషన్‌కు కొత్త ఎస్‌ఐ వచ్చినప్పుడు ఎలాంటి లాంఛనాలు పాటిస్తారో వాటన్నిం టినీ అధికారులు నెరవేర్చారు.

డీసీపీశరణప్ప ఈకార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పోలీస్‌ యూనిఫారంలో తన కుమారుడిని చూసి తల్లికి ఆనందభాష్పాలు వెల్లువెత్తాయి. అక్కడున్న అందరికీ కళ్లు చెమర్చాయి. 

సంతోషంగా ఉంది: శశాంక్‌  
సంపూర్ణ మద్య నిషేధం చేయాలని, మందుబాబులను సన్మార్గంలోకి తీసుకువచ్చి  ఉత్తమ సమాజ నిర్మాణానికి కృషిచేయాలని ఎస్‌ఐ శశాంక్‌ చెప్పారు. ఎంతో సంతోషంగా ఉందని, పోలీస్‌ కావాలనే చిరకాల కోరిక నేరవేరిందని అన్నారు. తన కుమారుడికి బాగా చదివేవాడని, దురదృష్టవశాత్తూ    తలస్సేమియా, మధుమేహం బారినపడ్డాడని తల్లి సుజాతచెప్పారు. అతడి ఆశలను ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు తీర్చారని చెప్పారు.  నగర పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌కుమార్, దక్షిణ విభాగ డీసీపీ శరణప్పలకు కృతజ్ఞతలు తెలిపారు. సాయంత్రం పోలీసు వాహనంలో ఆస్పత్రికి పంపించారు. 

>
మరిన్ని వార్తలు