కుటుంబంలో పెను విషాదం

12 Feb, 2018 11:43 IST|Sakshi

కారును ఢీకొన్న సరుకు ఆటో

భార్య మృతి, భర్త, కూతురికి తీవ్రగాయాలు

చింతామణి వద్ద దుర్ఘటన

చింతామణి: సెలవు రావడంతో ఆనందంగా సొంతూరికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం విరుచుకుపడింది. కారును సరుకు ఆటో డీ కొన్న ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించగా, ఆమె భర్తతో సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. చింతామణి తాలూకా కంచార్లపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలోని దండుపాళ్యం గేటు దగ్గర ఆదివారం ఈ ఘటన చోటుచేసుకొంది. మృతురాలిని లలితమ్మ (40)గా గుర్తించారు. వివరాలు... ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లా మదనపల్లి సొసైటీ కాలనీకి చెందిన రవీంద్రరెడ్డి, భార్య లలితమ్మ(40), కూతురు హారిక (18)తో కలిసి బెంగళూరు మహదేవపురలో నివాసం ఉంటున్నారు. రవీంద్రరెడ్డి సివిల్‌ ఇంజినీర్‌గా ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు.

భార్య పుట్టింటికి వెళ్తుండగా...
ఆదివారం సెలవు కావడంతో భార్య లలితమ్మ పుట్టినిల్లయిన తంబళ్లపల్లి మండలం ముద్దలదొడ్డి గ్రామంలోని తల్లిదండ్రులను చూడటానికి బెంగళూరు నుంచి బయల్దేరారు. ఉదయం 10 గంటలప్పుడు చింతామణి మీదుగా వెళుతుండగా ఎదురుగా రాగుల లోడుతో వచ్చిన సరుకు ఆటో వీరి కారును వేగంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు ముందుభాగం నుజ్జునుజ్జుకాగా భార్యాభర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. లలితమ్మ కొద్దినిమిషాలకే కన్నుమూసింది. రవీంద్రరెడ్డి తలకు తీవ్రకు గాయాలయ్యాయి, కూతురు నీహారికకు కాళ్లు, చేతులు విరిగాయి. వీరిని బెంగళూరు మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు.ఆటోలో వున్న వారు శ్రీనివాసపురం తాలూకా కూరకుల్లోపల్లి గ్రామానికి చెందని రైతులు నారాయణస్వామి, రామన్న, మూర్తి రాగులతో చింతామణి మార్కెట్‌కు వస్తుండగా ప్రమాదం సంభవించింది. వారికి కూడా గాయాలు తగిలాయి. ఆటోను మూర్తి నడుపుతున్నట్లు గుర్తించారు. కంచార్లపల్లి పోలీసులు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు