ఫోన్ చేస్తే.. సాయం

17 Dec, 2013 23:32 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: చలితో వణుకుతూ అపాయకరస్థితిలో ఎవరైనా రోడ్లపక్కన, ఫుట్‌పాత్‌లపై కనిపిస్తే ‘మనకెందుకులే..’ అనుకోకుండా ఒక్క ఫోన్‌కాల్ చేస్తే ఆ బాధితుడి ప్రాణాలు నిలపవచ్చు. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాట్స్ అంబులెన్స్‌లు మీరు ఫోన్ చేసిన నిమిషాల్లో అక్కడి వచ్చి అవసరమైన వైద్యసాయం అందిస్తాయి. పరిస్థితి బట్టి శరణార్థుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెంట్ల వరకు తరలిస్తారు. చలికారణంగా ఢిల్లీలోని అనాథలు మరణించ కుండా చూడడం క్యాట్స్‌అంబులెన్స్ (సెంట్రలై జ్డ్ అంబులెన్స్ ట్రామా సర్వీస్-సీఏటీఎస్) సిబ్బంది ముఖ్యవిధి.  క్యాట్స్ సిబ్బంది చెబుతున్న ప్రకారం రాత్రి చలిలో ఫుట్‌పాత్‌లపై పడుకునే నిరాశ్రయులకు అవసరమైన వైద్యసహాయం అందించడంతోపాటు వారిని దగ్గర్లోని నిరాశ్రయుల శిబిరాలకు తరలించడం వీరి ముఖ్య విధుల్లో ఒకటి. ఎవరు 102కి ఫోన్ చేసినా తాము స్పందించి అక్కడికి చేరుకుంటామని వారు పేర్కొంటున్నారు.
 అందుబాటులో 150 అంబులెన్స్‌లు:
 ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మొత్తం 150 క్యాట్స్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చారు. వీటన్నింటినీ 102 అత్యవసర నంబర్‌కు అనుసంధానం చేశారు. ఏడాది పొడవునా అందుబాటులో ఉండే ఈ అంబులెన్స్‌లు రోగులతోపాటు రోడ్డు ప్రమాదాల బారిన పడినవారిని సైతం ఆస్పత్రులకు చేరవేస్తుంటాయి.  గర్భిణులను ఆస్పత్రులకు చేర్చడం, ప్రసవం అనంతంర ఇళ్లకు తీసుకెళ్లడం వంటి సేవలు కూడా ఉపయోగించుకోవచ్చు.
 ఢిల్లీ హైకోర్టు ఆదేశంతో అమలు:
 చలికాలంలో ఢిల్లీలో నిరాశ్రయులైన అనాథలు చలికి వణుకుతూ మరణి స్తున్న కేసులు పెరగడంతో ఢిల్లీ హైకోర్టు ప్రత్యేకంగా చొరవ తీసుకుని వారి సంరక్షణార్థం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. చలి కారణంగా ఎవరైనా అనాథ మరణిస్తే దానికి ఢిల్లీ నగర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కోర్టు ఆదేశాలతో ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో మొత్తం 150 వరకు రాత్రిపూట వసతి శిబిరాలను ఏర్పాటు చేశారు. అనాథలకు రక్షణ కల్పించడంలో భాగంగానే ప్రభుత్వం క్యాట్స్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చింది.

>
మరిన్ని వార్తలు