ఒక ఓటు.. రూ.2 లక్షలు

6 May, 2016 14:56 IST|Sakshi

నేతల అవినీతిపై సెటైర్
వాట్సాప్‌లో హల్‌చల్
చైతన్య పరుస్తున్న మెసేజ్‌లు
ప్రలోభాలకు లొంగొద్దు
 
చెన్నై: ఒక ఓటుకు రూ.500, రూ.5వేలు అని వెలకట్టే ఓ నేతలారా ఈ ఓటు అసలైన విలువ ఎంతో తెలుసా...రూ.2లక్షలు. వినేందుకు ఇది ఆశ్చర్యంగా ఉన్నా నూరుశాతం నిజం అంటోంది ఒక వాట్సాప్ సందేశం. ప్రజల ఓటుతో అధికారం చేపట్టే నేతల అక్రమార్జన, అందులో ఓటరు వాటా ఎంత అని లెక్కకడుతూ ఓ తమిళపౌరుడు వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా చైతన్య ప్రచారం ప్రారంభించాడు.అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.
 
తమిళ నాడు జనాభా సుమారు 7.5 కోట్లు. ఇందులో 1.75 కోట్ల పిల్లలు. మిగతా 5.75 కోట్ల మంది ఓటర్లు. వీరిలో 30 శాతం మంది అంటే కోటి మంది మద్యం తాగేవారున్నారు. ఒక క్వార్టర్ బాటిల్ అమ్మితే రూ.50 లాభం. కోటి బాటిళ్లు అమ్మితే రూ.55 కోట్ల లాభం. అంటే ఏడాదికి రూ.20,075 కోట్లు, ఐదేళ్లకు రూ.లక్ష కోట్లు. ఈ సొమ్ము నీ జేబు నుంచి చోరీ చేయబడుతున్నదే.
 
ఇక ఇసుక ఏడాదికి రూ.25 వేల కోట్లు, ఐదేళ్లకు రూ.1.25లక్షల కోట్లు. అలాగే గ్రానైట్, క్వారీల ద్వారా ఏడాదికి రూ.25 వేల కోట్లు, ఐదేళ్లకు మరో రూ.1.25 లక్షల కోట్లు. ఈ సొమ్ము కూడా నీ జన్మభూమి నుంచి కొల్లగొడుతున్నదే.
 
విద్యుత్ చోరీ:
రోజుకు 4వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలులో యూనిట్‌కు 22 పైసలు కమీషన్ పొందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మెగావాట్లు లెక్క కడితే నెలకు రూ.66 కోట్లు, ఏడాదికి రూ.24వేల కోట్లు, ఐదేళ్లకు రూ.1.2 లక్షల కోట్లు కమీషన్‌గా స్వాహా చేస్తున్నారు. ఈ డబ్బంతా ప్రజల నుంచే కదా.
 
 కొల్లగొడుతున్న ప్రజా పనుల శాఖ:
 ప్రభుత్వ నిర్మాణ పనుల పేరున ప్రభుత్వ ఖజానాకు పరోక్షంగా రూ.5లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోంది. రవాణా, ఉద్యోగ నియామకాలతో లక్ష కోట్లు, ఉచితాల పంపిణీ ముసుగులో రూ. రూ.2లక్షల కోట్లు లెక్కన ఖజానాకు మొత్తం రూ.10లక్షల కోట్ల గండిపడుతోంది. మొత్తం పది విభాగాల్లో రూ.15 లక్షల కోట్లు పరోక్షంగా దోచేసుకుంటున్నారు. ఈ మోసాలు, కుంభకోణాలు లెక్క కడితే రాష్ట్రంలోని 5.75 కోట్ల ఓటర్లకు సరాసరిగా రూ.2లక్షలు చెల్లించవచ్చని వాట్సాప్ సందేశం.
 ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము నుంచే ఓటుకు రూ.500, రూ.1000గా చెల్లిస్తున్నారు. ప్రభుత్వాల్లో జరుగుతున్న దోపిడీపై ఓటర్లలో ఒక చైతన్యం కలిగించేందుకు మాత్రమే ఈ వివరాలు చెబుతున్నామేగానీ ఓటుకు రూ.2లక్షలు డిమాండ్ చేయమని కాదని వివరణ ఇచ్చుకున్నారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటేయండి, తప్పుచేసిన ప్రభుత్వాలను నిర్భయంగా నిలదీయండి అంటూ అతను ముక్తాయింపు ఇచ్చాడు.
 

మరిన్ని వార్తలు