రైతు ‘ప్యాకేజీ’ తరువాతే సభ

11 Mar, 2015 23:10 IST|Sakshi

ప్రభుత్వానికి స్పష్టం చేసిన విపక్షాలు
రైతన్నలకు న్యాయం చేయాలని డిమాండ్
మూడోరోజూ సభలో రభస

సాక్షి, ముంబై: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడో రోజు కూడా రైతుల ప్యాకేజీ అంశం దుమారం లేపింది. రైతులకు న్యాయం చేసేంత వరకు సభను సాగనివ్వబోమని ప్రతిపక్షాలు హెచ్చరించాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ‘మర్ జవాన్’, ‘మర్ కిసాన్’ అనే ధోరణితో ముందుకు వెళ్తుందని ఘాటుగా ఎన్సీపీ ఆరోపించింది. ‘నరేంద్ర మోదీ విదర్భలోని రైతులతో ‘చాయి పే చర్చ’ కార్యక్రమం జరిపారు. కాని ఆయన చర్చలో పాల్గొన్న గ్రామంలోని రైతే ఆత్మహత్యకు పాల్పడ్డాడు’ అని పేర్కొన్నాయి.

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కేవలం మీడియాలో ప్రచారం కోసం రైతుల ఇంట్లో పడుకోవడం లాంటి స్టంట్స్ చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా రైతుల సమస్యలపై చర్చలు జరిపేందుకు కూడా సుముఖత తెలపడం లేదని ఎన్సీపీ గ్రూప్ లీడర్ జయంత్ పాటిల్ పేర్కొన్నారు. ప్రతి హెక్టార్‌కు రూ. 25 వేల చొప్పున వెంటనే ప్యాకేజీ అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే ప్రసంగం అనంతరం ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
 
సమావేశాలు ముగిసేలోపు ప్యాకేజి ప్రకటిస్తాం: ఏక్‌నాథ్ ఖడ్సే
సమావేశాలు ముగిసేలోపు రైతులకు మద్దతు ప్యాకేజీ ప్రకటిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే తెలిపారు. రైతులకు ఊహించి నంత మద్దతు అందించలేకపోయామని అంగీకరించారు. ‘అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల వివరాల సేకరణ ప్రారంభించాం. అయితే ఇంకా పూర్తికాలేదు. ఇప్పుడే పూర్తిస్థాయి ప్యాకేజీ ప్రకటించడం సాధ్యంకాదు. రైతన్నలకు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రాన్ని కోరాం. ఇంకా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కేంద్ర సాయంపై ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులకు రూ. 2 వేల కోట్ల ఆర్థికసాయం ఇప్పటికే అందించాం. సుమారు 78 శాతం రైతులకు సాయం అందింది. మిగిలిన రైతులకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించగానే అందజేస్తాం’ అని ఖడ్సే చెప్పారు. వివరాల సేకరణ పూర్తికానిదే రైతులకు ప్యాకేజీ అందించలేమని మంత్రి చెప్పగానే ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి.
 
‘ప్యాకేజీ’ ప్రకటించేంతవరకు సభను సాగనివ్వం: ధనంజయ్ ముండే
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వెంటనే రైతులకు మద్దతు ప్యాకేజీ ప్రకటించాలని, లేదంటే సభను సాగనివ్వబోమని శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ధనంజయ్ ముండే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా రైతులు కరవు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయారు. ఈ విషయంపై ప్రభుత్వం కనీసం చర్చలు జరిపేందుకు కూడా ముందుకు రావడం లేదు’ అని ఆరోపించారు.

‘రాష్ట్రంలోని 353 తాలూకాల్లో 284 చోట్ల లోటు వర్షపాతం నమోదైంది. 23,811 గ్రామాల్లో కరవు పరిస్థితి నెలకొంది. కరవు ప్రాంతాల్లోని రైతులకు ఇంత వరకు ఆర్థిక సాయం అందలేదు. ప్రతి రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 100 రోజుల పాలనలో 300కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వ రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది’ అని ముండే విమర్శించారు.

>
మరిన్ని వార్తలు