ఇం‘ధనం’పై ఆగ్రహం

22 Apr, 2018 08:25 IST|Sakshi

ప్రభుత్వంపై ప్రతిపక్షాల దాడి

అసెంబ్లీలో ప్రశ్నత్తరాలకు తెర

పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్‌ 

భువనేశ్వర్‌ : అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ విరుచుకుపడింది. శాసన సభలో శనివారం బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన మరుక్షణమే కాంగ్రెస్‌ సభ్యులు అధికార పక్షంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరల నియంత్రణలో కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు ఘోరంగా విఫలమైంది. డీజిల్, పెట్రోల్‌ ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పరోక్షంగా పూచీదారు అని రాష్ట్ర కాంగ్రెస్‌ శాసన సభా పక్ష నాయకుడు నర్సింగ మిశ్రా ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో ఇటీవల లాకప్‌ డెత్‌ సంభవించింది. ఈ విచారకర సంఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ముఖ్యమంత్రిని స్పీకర్‌ ఆదేశించాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. 

ప్రశ్నోత్తరాలకు తెర
శనివారం నాటి సభా కార్యక్రమాలు ప్రారంభమైన  వెంటనే ప్రతిపక్షాలు దూకుడుగా వ్యవహరించడంతో   ప్రశ్నోత్తరాలకు గండిపడింది. ప్రతిపక్షాల గోలతో సభా కార్యక్రమాల నిర్వహణ అసాధ్యమని ప్రకటించి స్పీకర్‌ ప్రదీప్‌ కుమార్‌ ఆమత్‌ సభా కార్యక్రమాల్ని వాయిదా వేశారు. తొలుత ఉదయం 11.30 గంటల వరకు వాయిదా వేశారు. అప్పటికీ సభలో వాతావరణం అనుకూలించనందున తిరిగి మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేసినట్లు స్పీకర్‌ ప్రకటించారు. ఇంధన ధరల పెరుగుదల పట్ల సభలో చర్చకు అనుమతించాలని కాంగ్రెస్‌ సభ్యులు సభలో రభస చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఇంధన ధరలు దిగజారుతున్నప్పటికీ దేశం, రాష్ట్రంలో వీటి ధరలు పెరగడంపట్ల కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశంలో ఇంధన ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన కార్యాచరణ ఖరారు చేయనందున ఈ దయనీయ పరిస్థితులు తాండవిస్తున్నట్లు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంధన ఉత్పాదనలపై పన్నుభారం తగ్గిస్తే వినియోగదారులకు కొంతవరకు వెసులుబాటు లభిస్తుందని కాంగ్రెస్‌ శాసన సభా పక్ష నాయకుడు నర్సింగ మిశ్రా సూచించారు.    ఈ నేపథ్యంలో ప్రభుత్వం సభలో ప్రకటన జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. 

రాష్ట్రంలో తక్కువ వ్యాట్‌
దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా వాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ను ఒడిస్సాలో విధిస్తున్నట్లు అధికార పక్షం బిజూ జనతా దళ్‌ చీఫ్‌విప్‌ అమర ప్రసాద్‌ శత్పతి తెలిపారు. ద్రవ్య సేవా పన్ను (జీఎస్టీ) వడ్డన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదు. ద్రవ్య సేవా పన్ను మండలి ఈ వ్యవహారంలో ప్రధానమైనదిగా ఆయన పేర్కొన్నారు. ఇంధన ఉత్పాదనలపై అబ్కారీ పన్ను, సెస్సు భారం కావడంతో రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్‌ వంటి ఇంధన ఉత్పాదనల ధరలు గణనీయంగా పెరుగుతున్నట్లు ఆయన వివరించారు. ఈ సమాధానానికి సంతృత్తి చెందిన కాంగ్రెస్‌ సభ్యులు పార్టీ చీఫ్‌ విప్‌ తారా ప్రసాద్‌ బాహిణీపతి నేతృత్వంలో స్పీకర్‌ పోడియం వైపు దూసుకుపోయారు.

కేంద్రంలో యూపీఏ సర్కారు హయాంలో డీజిల్, పెట్రోల్‌ ధరల పెరుగుదలను పురస్కరించుకుని రోడ్డెక్కిన ఉభయ భారతీయ జనతా పార్టీ, బిజూ జనతా దళ్‌ వర్గాలు తాజా పెంపుపట్ల పెదవి కదపకుండా చోద్యం చూస్తున్నాయని తారాప్రసాద్‌ బాహిణీపతి ఆరోపించారు. కేంద్రంలో యూపీఏ పాలన సమయంలో అంతర్జాతీయ తైల మార్కెట్‌లో ముడి తైలం (క్రూడ్‌ ఆయిల్‌) ధర హెచ్చుగా ఉండేది. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల అనివార్యంగా కొనసాగింది. తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అంతర్జాతీయ తైల మార్కెట్‌లో ముడి తైలం ధర దిగజారుతోంది. అయినా దేశవ్యాప్తంగా ఇంధన ధరలు రెక్కలు కట్టుకుని పెరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.దేశవ్యాప్తంగా పెరుగుతున్న డీజిల్, పెట్రోల్‌ వంటి ఇంధనం ధరలపట్ల ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ సభ్యులు విరుచుకుపడ్డారు. 

లాకప్‌డెత్‌ సంగతేంటి? 
నయాగడ్‌ జిల్లా మధ్య ఖొండో పోలీస్‌ఔట్‌పోస్టులో ఖైదీ మరణంపట్ల భారతీయ జనతా పార్టీ రంకెలు వేసింది. నయాగడ్‌ జిల్లా దసపల్లా మధ్య ఖొండొ పోలీస్‌ఔట్‌పోస్ట్‌ లాకప్‌లో యువకుడు మరణించాడు. ఈ నెల 16వ తేదీన సందిగ్ధంతో ఓ యువకుని అరెస్టు చేసి పోలీసులు లాకప్‌లో పడేశారు. అదే రోజు రాత్రి నిందిత యువకుడు కాలి తీవ్రంగా గాయపడినట్లు భారతీయ జనతా పార్టీ సభ్యులు తెలిపారు. నిందిత యువకుని పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కటక్‌ ఎస్సీబీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా ఈ నెల 20వ తేదీన నిందిత యువకుడు కన్ను మూశాడు. పోలీసులు తమ బిడ్డను కాల్చి చంపేశారని మృతుడి కుటుంబీకులు వాపోయారు. కిరసనాయిల్‌ పోసుకుని నిందితుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు వర్గాలు ఆలస్యంగా ప్రకటించాయి. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ముఖ్యమంత్రిని ఆదేశించాలని భారతీయ జనతా పార్టీ సభ్యుడు రొబి నాయక్‌ అసెంబ్లీ స్పీకర్‌ ప్రదీప్‌ కుమార్‌ ఆమత్‌ను అభ్యర్థించారు.

మరిన్ని వార్తలు