మళ్లీ ఒకటిగా..

31 May, 2017 03:04 IST|Sakshi
మళ్లీ ఒకటిగా..

ఒకే వేదికగా ప్రతి పక్షాలు
పశువధ వ్యవహారంలో కేంద్రం తీరుపై శివాలు
కోర్టు రూపంలో కేంద్రానికి చెక్‌

సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ప్రతి పక్షాలన్నీ మళ్లీ ఒకే వేదిక మీదకువచ్చాయి. కేంద్రాన్ని ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాయి. పశువధ వ్యవహారంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ ఉమ్మడిగా ప్రతి పక్షాల నేతలు ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఇక, కేంద్రం నిర్ణయానికి కోర్టు స్టే విధించడంతో రైతులు, మాంసం విక్రయదారులు, పశువుల పెంపకం దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి పక్షాలు ఎవరి దారి వారిది అన్నట్టుగా సాగుతూ వచ్చిన విషయం తెలిసిందే.

రైతు సమస్యల్ని అస్త్రంగా చేసుకుని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఇచ్చిన పిలుపునకు కొన్ని ప్రతి పక్షాలు కదిలాయి. ఆ మేరకు డీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్, మనిదనేయమక్కల్‌ కట్చిలు ఏకమైన రైతు సమస్యలపై ఉద్యమించాయి. తదుపరి ఎవరి దారి వారిదే. ఈ పరిస్థితుల్లో పశువధకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తుండడంతో మళ్లీ ప్రతి పక్షాలు ఏకం కావడం గమనార్హం. నేతలు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై శివాలెత్తడం బట్టి చూస్తే, ఈ స్నేహం రానున్న ఎన్నికల్లోనూ సాగేనా అన్న ప్రశ్నను తెరమీదకు తెచ్చింది.

మళ్లీ ఏకం.. ఉమ్మడిగా ప్రకటన:
డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ నేత ఖాదర్‌ మొహిద్దీన్, మనిదయనే మక్కల్‌ కట్చి నేత జవహరుల్లాలు కేంద్రం తీరును తప్పుబడుతూ ఉమ్మడిగా మంగళవారం ప్రకటన విడుదల చేశారు. పశువధ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని లేని పక్షంలో, తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపక పోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఖండిస్తూ నేతలు తీవ్రంగానే స్పందించారు. ఇక, డీఎంకే, కాంగ్రెస్‌ల నేతృత్వంలో బుధవారం ఆందోళనలుసాగనున్నడం గమనార్హం.

కోర్టు స్టేతో హర్షం :
కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వ మౌన వైఖరికి నిరసనగా రాష్ట్రంలో మంగళవారం కూడా ఆందోళనలు హోరెత్తాయి. ఈ పరిస్థితుల్లో మదురైకు చెందిన సెల్వ గోమతితో పాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌కు మదురై ధర్మాసం స్పందించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పశువుల పెంపకం దారులు, మాంసం విక్రయ దారులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయానికి మధ్యంతర స్టే విధించ బడ్డా, ఇది తాత్కాలికమే కావడంతో నిరంతరంగా అడ్డుకట్ట వేయాలన్న నినాదంతో సర్వత్రా ముందుకు సాగుతున్నారు.

మరిన్ని వార్తలు