రహస్యంగా..

27 Apr, 2017 02:51 IST|Sakshi
రహస్యంగా..

► రాత్రంతా విలీన మంతనాలు
► ఉదయాన్నే బ్యానర్ల తొలగింపు
► కార్యదర్శులతో పళనిస్వామి సంతకాలు
► నిర్ణయాధికారం ఆయన చేతికే
► సమయం కోసం పన్నీరు శిబిరం ఎదురుచూపు
► చర్చలు సాగుతాయని మునుస్వామి స్పష్టీకరణ


సాక్షి, చెన్నై: ఆగిందనుకున్న చర్చలకు మళ్లీ జీవం పోసే పనిలో రెండు శిబిరాల నేతలు నిమగ్నమైనట్టున్నారు. మంగళవారం అర్ధరాత్రి పరిణామాలతో బుధవారం ఉదయాన్నే సీఎం పళనిస్వామి శిబిరం దూకుడు పెంచింది. చిన్నమ్మ బ్యానర్ల తొలగింపు, జిల్లాల కార్యదర్శులతో సంతకాల సేకరణ వెరసి విలీన చర్చ మళ్లీ తెర మీదకు వచ్చింది. అన్ని కలిసి వస్తున్నాయని, సమయానుకూలంగా చర్చలకు వెళ్తామని పన్నీరు శిబిరం ప్రకటించడంతో ఎదురుచూపులు పెరిగాయి. అన్నాడీఎంకేలో పన్నీరు, పళని శిబిరాలు ఏకమయ్యే విధంగా వారం పది రోజులుగా రాష్ట్రంలో చర్చ సాగుతూ వచ్చిన విషయం తెలిసిందే.

అయితే, ఇరు శిబిరాల మధ్య పేలుతూ వచ్చిన మాటల తూటాలు, తెర మీదకు వచ్చిన కీలక డిమాండ్ల పర్వాలు వెరసి ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా విలీన వ్యవహారం మారింది. చర్చలకు తేదీ నిర్ణయించినా, చివరకు రెండు శిబిరాల ఒకే వేదిక మీదకు రాలేదు. దీంతో చర్చలు ఆగినట్టేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి ఓ హోటల్‌లో రెండు శిబిరాల మధ్య సుదీర్ఘచర్చ సాగడం వెలుగులోకి వచ్చింది.

పన్నీరు శిబిరం నుంచి మాజీ మంత్రులు కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్, పళనిస్వామి శిబిరానికి చెందిన ఎంపీ వైద్యలింగం, మంత్రి సెంగోట్టయన్‌ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఐదు గంటల మేరకు ఆ హోటల్లో చర్చలు సాగించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈసందర్భంగా తమ వైపు ఉన్న వాదనలు, డిమాండ్లను పళనిస్వామి శిబిరానికి తెలియజేసినట్టు సమాచారం. అదే రాత్రి పార్టీ బహిష్కృత ఉప ప్రధానకార్యదర్శి టీటీవీ దినకరన్‌ అరెస్టుతో ఉదయాన్నే పళని స్వామి శిబిరం దూకుడు పెంచడం గమనార్హం.

చిన్నమ్మ బ్యానర్లు తొలగింపు: ఉదయాన్నే రాయపేటలోని పార్టీ కార్యాలయంలో ఉన్న చిన్నమ్మ బ్యానర్లన్నీ తొలగించారు. ఈ సమాచారంతో టీటీవీ మద్దతుదారులు అక్కడికి వచ్చి హడావుడి సృష్టించారు. గెంగవళ్లికి చెందిన రాయప్ప అనే మద్దతుదారుడు ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని బెదిరించడంతో అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు పహార నడుమ ఆగమేఘాలపై ఆ బ్యానర్లు తొలగించారు. ఆ స్థానంలో అమ్మ జయలలిత ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం విశేషం.

ఇక, మంగళవారం కొందరు జిల్లాల కార్యదర్శులు చెన్నైకు చేరుకున్నా, బుధవారం మరి కొందరు రావడంతో మొత్తంగా 31 జిల్లాల కార్యదర్శుల వద్ద సంతకాల సేకరణ సాగడం ఆలోచించదగ్గ విషయం. పార్టీకి పెద్ద దిక్కుగా ప్రస్తుతం సీఎం పళనిస్వామికే బాధ్యతల్ని అప్పగించే అంశాలు ఆ సంతకాలు చేసిన పత్రాల్లో ఉన్నట్టు సమాచారం. ఎన్నికల కమిషన్‌కు ఏదేని వివరాలు, సమాచారాలు ఇవ్వాల్సి ఉంటే, ఆ బాధ్యతలు, ఇతర నిర్ణయాధికారాలన్నీ సీఎంకే కల్పించి ఉండడం చూస్తే, మళ్లీ విలీనం చర్చ తెర మీదకు వచ్చినట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

బుధవారం రాత్రి కూడా మళ్లీ మంతనాలు సాగనున్నట్టు సమాచారం. ఈ దృష్ట్యా, గురువారం మరింతగా దూకుడు పెంచే విధంగా పళనిస్వామి శిబిరం ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో తమ డిమాండ్‌ మేరకు చిన్నమ్మ బ్యానర్లను తొలగించడాన్ని పన్నీరుశిబిరం ఆహ్వానించడమే కాకుండా, అన్నీ కలిసి వస్తున్నాయని, చర్చలు సరైన సమయంలో జరుగుతాయని ఆ శిబిరానికి మాజీ మంత్రి కేపీ మునుస్వామి వ్యాఖ్యానించడం విశేషం. అలాగే, పళని శిబిరానికి చెందిన మంత్రి సీవీ షణ్ముగం పేర్కొంటూ, చర్చలకు ఆహ్వానించామని, ఎప్పుడు వచ్చినా సిద్ధంగానే ఉన్నట్టు స్పందించారు. చిన్నమ్మ బ్యానర్ల విషయంలో ముందుగానే నిర్ణయం తీసుకున్నా, తొలగింపునకు కొంత సమయం పట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు