మళ్లీ ఫోన్‌ ట్యాపింగ్‌

12 Jan, 2018 07:27 IST|Sakshi

 కేంద్రంపై హోంమంత్రి రామలింగారెడ్డి ఆరోపణలు

రాష్ట్రంలో మళ్లీ ఫోన్‌ ట్యాపింగ్‌ రగడ తెరపైకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల ఫోన్‌ సంభాషణలను చాటుగా వింటోందని రాష్ట్ర హోంమంత్రి మరోసారి ఆరోపణలు సంధించడం ఆసక్తికరంగా మారింది. కొద్దినెలల కిందట సీఎం సిద్ధరామయ్యతో పాటు పలువురు మంత్రులు ఇవే ఆరోపణలు చేయడం తెలిసిందే.  

బనశంకరి: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల ఫోన్లను కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్‌ చేస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆరోపించారు. దివంగత ప్రధానమంత్రి లాల్‌బహదూర్‌శాస్త్రి 52వ వర్ధంతి సందర్భంగా గురువారం విధానసౌధ ఆవరణలోనున్న శాస్త్రి విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై చాలారోజుల కిందటే ప్రస్తావించానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వారే ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారు, ఇది చేయడానికి ఇతరులకు సాధ్యమా? అని ప్రశ్నించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిరంతరం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని, చట్టం ప్రకారం ఇతరుల ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం తప్పు, దీనిని ఉన్నత న్యాయస్థానాలు ప్రశ్నించాలని మంత్రి పేర్కొన్నారు.

పోలీసుల స్థైర్యంపై దాడులు చేస్తున్నారు
చిక్కమంగళూరు జిల్లా మూడగెరె తాలూకాలో డిగ్రీ విద్యార్థిని ధన్యశ్రీ ఆత్మహత్య కేసులో బుధవారం బెంగళూరులో సంతోష్‌ అనే యువకుడితో పాటు మొత్తం నలుగురిని అరెస్ట్‌ చేశామని రామలింగారెడ్డి తెలిపారు. పోలీస్‌ల నైతికస్థైర్యంపై బీజేపీ యువమోర్చా దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు సమాచారం ఉందన్నారు. గతంలో బీజేపీ ప్రభుత్వం ఉండగా దౌర్జన్యాలు అధికమయ్యాయని, తమ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన అనంతరం తగ్గిందన్నారు. కానీ అక్కడక్కడ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు. పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అంతకుముందు లాల్‌బహదూర్‌ శాస్త్రి గురించి మాట్లాడిìన రామలింగారెడ్డి పేదల ఆకలి తీర్చడానికి రేషన్‌ వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చారని, కరువులను సమర్థంగా ఎదుర్కొన్నారని చెప్పారు.

>
మరిన్ని వార్తలు