చెలరేగిన చైన్ స్నాచర్లు

25 Dec, 2014 02:24 IST|Sakshi

బెంగళూరు : కేవలం 40 నిమిషాల వ్యవధిలోనే బెంగళూరు చైన్‌స్నాచర్లు చెలరేగిపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో మహిళల మెడలోని బంగారు గొలుసులు లాక్కొని ఉడాయించారు. మంగళవారం సాయంత్రం ఆరు నుంచి 6.40 గంటల్లోపు చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా....

సిగ్నల్‌లో :  హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌కు చెందిన లెజీనా అనే మహిళ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు కారులో సిల్క్ బోర్డు మీదుగా బయలుదేరారు. సిల్క్‌బోర్డు జంక్షన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్‌లో కారు అద్దం తీసి వేచి ఉన్నారు. ఆ సమయంలో బైక్‌లో అటుగా వచ్చిన ఇద్దరు కారులో ఉన్న ఆమె మెడలో ఉన్న 40 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు.
 
ఇంటికి వెలుతుంటే :


 హెచ్‌ఆర్‌బీఆర్ లేఔట్‌లో నివాసం ఉంటున్న భారతి అనే మహిళ ఏజీఎస్ అనే కార్యాలయంలో పని చేస్తున్నారు. ఈమె మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు కార్యాలయంలో పనిముగించుకుని ఇంటికి బయలుదేరారు. మార్గ మధ్యలో హెచ్‌ఆర్‌బీఆర్ లేఔట్‌లో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలో ఉన్న 35 గ్రాముల బంగారు గొలుసు లాక్కోని పరారైనారు.

ఇంటి ముందు నిలబడి ఉంటే :

త్యాగరాజనగరలోని శాస్త్రినగరలో పద్మావతి అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటి ముందు నిలబడి ఉన్నారు. ఆ సమయంలో బైక్‌లో వెళ్లిన ఇద్దరు నిందితులు అడ్రస్ అడిగే నెపంతో పద్మావతి మెడలో ఉన్న 60 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు.
 
విద్యుత్ బిల్లు కట్టి వెలుతుంటే :
 
చిక్కమారనహళ్ళికి చెందిన కోమల  మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు తన ఇంటి సమీపంలోని బెంగళూరు ఒన్ కేంద్రంలో విద్యుత్ బిల్లు కట్టి తిరుగు ప్రయానమయ్యారు. మార్గ మధ్యలో బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలోని 45 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు.

పక్కింటి మహిళతో మాట్లాడుతుంటే :

కుమారస్వామి లేఔట్‌లోని హర్ష లేఔట్‌కు చెందిన శారద, మంగళవారం సాయంత్రం 6.40 గంటలకు తన పక్కింటి మహిళతో మాట్లాడుకుంటుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలోని 65 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాచు. ఈ ఘటనలపై  మడివాళ, హెణ్ణూరు, బెంగళూరు సెంట్రల్, త్యాగరాజనగర, కుమారస్వామి లేఔట్‌లో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
బుధవారం కూడా...  
 
విజయనగర సమీపంలోని గోవిందరాజనగరకు చెందిన ఈశ్వరీ బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు తన ఇంటి ముందు నిలబడి ఉండగా బ్లాక్ పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమెను పలకరించి, అడ్రస్ అడిగే నెపంతో సమీపించారు. ఆమె తనకు తెలియదు అని చెప్పే లోపు ఆమె మెడలో ఉన్న 45 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఘటనలో ఈశ్వరీ కిందపడడంతో ఆమె గాయాలయ్యాయి.
 
ప్రశాంత నగర్‌లోనూ ఉషా అనే మహిళ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తన ఇంటి నిలబడి స్నేహితురాలితో మాట్లాడుతుండగా బ్లాక్ పల్సర్‌పై వచ్చిన ఇద్దరు అడ్రస్ అడిగే నెపంతో ఆమె మెడలోని 70 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసినట్లు విజయనగర పోలీసులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు