సొంత గూటికి శ్రీరాములు ..?

3 Mar, 2014 02:15 IST|Sakshi

సాక్షి, బళ్లారి : బీఎస్‌ఆర్ సీపీ అధినేత బీ.శ్రీరాములు బీజేపీలోకి చేరనున్నారా..? ఇక్కడి పరిస్థితులు, ఆదివారం కంప్లిలో శ్రీరాములు మాట్లాడిన తీరును బట్టి చూస్తే నిజమే అనిపిస్తోంది. బీజేపీ జాతీయ,రాష్ట్ర నేతలు నుంచి శ్రీరాములును, గాలి వర్గాన్ని బీజేపీలోకి చేర్చుకునేందుకు పచ్చ జెండా ఊపారా? శ్రీరాములు, గాలి శిబిరం కూడా బీజేపీలోకి చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారా? పై ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానాలు వెలువడుతున్నాయి. బళ్లారి జిల్లాలో ఏ నలుగురు కలిసినా ఇదే టాపిక్‌పై చర్చించుకుంటున్నారు.

ఈ చర్చకు  త్వరలో తెరపడనుంది. శ్రీరాములు బీజేపీలోకి చేరేందుకు దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. బీఎస్‌ఆర్‌సీపీని బీజేపీలోకి విలీనం చేయడం దాదాపు ఖాయమని సంకేతాలు వెలువడుతున్నాయి. 2008 సంవత్సరంలో దక్షిణ భారత దేశంలో బీజేపీ అధికారంలోకి రావడానికి యడ్యూరప్పతోపాటు గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములు కృషి ఎంతో ఉంది. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా మంత్రిగా ఉన్నప్పుడే  ఆయన తన పదవికి రాజీనామా చేసి, అనంతరం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత అ బీజేపీ నుంచి బయటకు వచ్చి బీఎస్‌ఆర్‌సీపీ ఏర్పాటు చేశారు.

2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరాములు, యడ్యూరప్ప బీజేపీని వీడటంతో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి కాంగ్రెస్ పార్టీకి ముకుతాడు వేసేందుకు బీజేపీ నుంచి దూరం అయిన ముఖ్య నేతలను తిరిగి ఆ పార్టీ జాతీయ నేతలు ,రాష్ట్ర నేతలు యడ్యూరప్పను బీజేపీలోకి తిరిగి చేర్చుకున్న సంగతి తెలిసిందే. అనంతరం కేజేపీని బీజేపీలోకి విలీనం చేయడంతో బీజేపీకి కొండంత బలం చేకూరింది. లింగాయత్ సమాజిక వర్గానికి చెందిన యడ్యూరప్ప బీజేపీలోకి చేరడంతో కాంగ్రెస్ పార్టీకి కొంత భయం పుట్టుకుంది.

అదే సందర్భంలో మాస్‌లీడర్‌గా గుర్తింపు పొందిన శ్రీరాములు బలమైన వాల్మీకి సమాజానికి చెందిన వాడు. ఆయన బీజేపీలోకి చేరితే గాలి శిబిరం కూడా బీజేపీలోకి చేరుతుంది. దీంతో రాష్ట్ర నేతలు మాజీ సీఎం జగదీష్‌శెట్టర్, ఈశ్వరప్పలు తొలుత పావులు కదిపారు. జాతీయ ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాలు బళ్లారిలో జరుగుతున్న సమయంలో మాజీ సీఎం జగదీష్‌శెట్టర్ స్వయానా గాలి జనార్దనరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. అనంతరం రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు ఈశ్వరప్ప బళ్లారిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు ఆయన స్వయానా శ్రీరాములుతో చర్చలు జరిపి బీజేపీలోకి ఆహ్వానించారు.  ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో  పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని శ్రీరాములు స్వయంగా కలిసి తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అందుకే శ్రీరాములు కూడా కంప్లిలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ బీజేపీలోకి చేరడం దాదాపు ఖాయమని, కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో శ్రీరాములు , గాలి శిబిరం తిరిగి బీజేపీలోకి చేరడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా బళ్లారిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బళ్లారి ఎంపీ శాంతా, కంప్లి ఎమ్మెల్యే సురేష్‌బాబు, మిత్రులు గాలి జనార్దన రెడ్డి, గాలి సోమశేఖర రెడ్డి తదితర పార్టీ నేతలతో మాట్లాడి నాలుగైదు రోజుల్లో పార్టీ విలీనం గురించి ప్రకటిస్తానని చెప్పడం గమనార్హం.
 
‘అంబి త్వరలో కోలుకుంటారు’


 సాక్షి,బెంగళూరు:  శాండిల్‌వుడ్ నటుడు, రాష్ట్ర మంత్రి అంబరీష్ త్వరలో కోలుకోనున్నారని సింగపూర్‌లోని మౌంట్‌ఎలిజిబెత్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈమేరకు ఆదివారం అక్కడి ఆస్పత్రి ఒక బులిటెన్ విడుదల చేసింది. శ్వాసకోసం సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన్ను ఉత్తమ చికిత్సకోసం బెంగళూరులోని విక్రం ఆస్పత్రి నుంచి సింగపూర్‌కు తరిలించిన విషయం తెలిసిందే. కోలివుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు గతంలో చికిత్స అందించిన డాక్టర్ శెట్టి నేతృత్వంలోని వైద్య బృందం అంబరీష్‌కు చికిత్స అందిస్తున్నారు. అంబరీష్ వెంట ఆయన భార్య సుమలత, కుమారుడు అభిషేక్ తదితరులు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు