పాక్ కాల్పులు నిరసిస్తూ ఏబీవీపీ మానవహారం

12 Oct, 2014 02:20 IST|Sakshi
పాక్ కాల్పులు నిరసిస్తూ ఏబీవీపీ మానవహారం

చిత్రదుర్గం : భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైనికులు తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడటాన్ని నిరసిస్తూ శనివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ చేశారు. నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చారు. అక్కడ మానవహారం నిర్మించి సుమారు పావుగంట సేపు రాస్తారోకో చేసి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఆందోళనకు నాయకత్వం వహించిన ఏబీవీపీ రాష్ట్ర సహ కార్యదర్శి పవన్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడుతూ పాకిస్థాన్ సైనికులు, తీవ్రవాదులు భారత్‌లోకి చొరబడుతున్నారని, దీనిని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వెంటనే పాకిస్థాన్ కాల్పులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ కాల్పులకు కేంద్ర ప్రభుత్వం, బీఎస్‌ఎఫ్ బలగాలు కూడా తగిన సమాధానమిచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా సహ సంచాలకుడు యువరాజ్, నగర ఉపాధ్యక్షుడు బీ.ప్రసాద్, జిల్లా విద్యార్థిని ప్రముఖ్ జయశ్రీ, విద్యార్థులు అక్షయ్, ధరణి, విష్ణు, చంద్రశేఖర్, చం దన, అంబిక, సౌందర్య పాల్గొన్నారు.
 
బళ్లారి అర్బన్ : జమ్ముకాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో భారత పౌరులకు, భద్రతా దళాలకు తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శనివారం స్థానిక మున్సిపల్ కళాశాల నుంచి రాయల్ సర్కిల్ మీదుగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ జిల్లా కార్యాలయానికి చేరుకుని జిల్లా అధికారికి వినతిపత్రం అందజేశారు.

ఏబీవీపీ నగర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ దేశ సరిహద్దులో కేంద్ర ప్రభుత్వం మెతక వైఖరి అవలంభించకుండా పాకిస్థాన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా సంచాలకుడు మహిపాల్‌రెడ్డి, రవిగౌడ, తాలూకా సంచాలకుడు గోవిందరెడ్డి, కేదార్‌రెడ్డి, అరుణ పాటిల్, మారుతి, రమేశ్, మంజునాథ్, ఉదయ్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు