ఇక మంత్రులకు కొత్త లగ్జరీ కార్లు

5 Mar, 2017 03:47 IST|Sakshi
ఇక మంత్రులకు కొత్త లగ్జరీ కార్లు

► సీఎం కేపీఎస్‌ దూకుడు
► కొత్త పథకాలకు శంకుస్థాపనలు 
► హోంశాఖ కార్యదర్శి మార్పు
► ఢిల్లీకి మంత్రులు           
►  జీఎస్‌టీకీ ఆమోదంతో మైత్రీ


రాష్ట్రం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతుంటే,  సీఎం ఎడపాడి పళని స్వామి కేబినెట్‌ లగ్జరీ సౌకర్యాలతో పాలనా వ్యవహారాల మీద దృష్టి పెట్టినట్టుందన్న విమర్శలు బయలుదేరాయి. మంత్రులకు ఆరు కోట్ల మేరకు ఖర్చుతో కొత్త కార్లను అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఇక, పాలన మీద పట్టు సాధించే దిశగా దూకుడు పెంచే పనిలో పడ్డ పళనిస్వామి, తాజాగా ప్రారంభోత్సవాల వేదికను మార్చడం గమనార్హం.

సాక్షి, చెన్నై : రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎడపాడి పళనిస్వామి బాధ్యతలు స్వీకరించి రెండు వారాలు అవుతోంది.  ఓ వైపు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు, మరోవైపు పాలనా పరంగా పట్టుకు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ప్రస్తుతం అమ్మ సుపరిపాలన నినా దంతో దూకుడు పెంచారు.  శుక్రవారం కేబినెట్‌ మీటింగ్‌లో కీలక అంశాలపై చర్చ సాగించి, అసెంబ్లీలో బడ్జెట్‌ దాఖలుకు కార్యచరణను సిద్ధం చేశారు. ఈనెల 22వ తేదీ సభలో బడ్జెట్‌ దాఖలు అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇక, నీట్‌ పరీక్షకు వ్యతిరేకంగా కేంద్రం వద్ద పంచాయతీ పెట్టేందుకు ఎనిమిది మంది మంత్రులతో కూడిన బృందాన్ని ఈనెల ఎనిమిదో తేదీన ఢిల్లీకి పంపించేందుకు నిర్ణయించారు.

అలాగే,  శనివారం ఢిల్లీలో ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ సమక్షంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి జయకుమార్‌ పాల్గొని, జీఎస్‌టీకి సంపూర్ణ మద్దతును ప్రకటించేశారు. పాలన మీద దూకుడు, కేంద్రంతో మైత్రి లక్ష్యంగా ప్రయత్నాల్లో ఉన్న పళని స్వామి, అధికారుల్ని తన గుప్పెట్లోకి తీసుకునేందుకు సిద్ధమైనట్టున్నారు.

హోం కార్యదర్శి బదిలీ: కొన్నేళ్లుగా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తూ వచ్చిన అపూర్వ వర్మను బదిలీ చేసి ఆయన స్థానంలో నిరంజన్  మార్టిన్ ను నియమించారు. మరి కొందరి బదిలీల మీద దృష్టి పెట్టడంతో ఐఏఎస్‌లలో ఉత్కంఠ పెరిగింది. హోంశాఖ కార్యదర్శిని ప్రాధాన్యత లేని పర్యాటక, దేవాదాయ శాఖకు బదిలీ చేసిన నేపథ్యంలో ఇక, డీజీపీ రాజేంద్రన్ ను కూడా మార్చేస్తారేమో అన్న చర్చ పోలీసు వర్గాల్లో బయలుదేరింది.

లగ్జరీగా : అధికారం మీద పట్టులో భాగంగా మంత్రులు చేజారకుండా, అందరికీ కొత్త వాహనాలు అప్పగించి విమర్శలను కొని తెచ్చుకున్నారు. ఇన్నాళ్లు మంత్రులు వాడుతున్న వాహనాలన్నీ కొత్తగానే ఉన్నాయి. ఆగమేఘాలపై 30 మంది మంత్రులకు తలా రూ. పదిహేను నుంచి  20 లక్షల మేరకు వెచ్చించి కొత్త వాహనాలను అప్పగించడం ఆలోచించాలి్సందే. రాష్ట్రం అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఈ కొత్త కార్లు అవసరమా అని ప్రశ్నించే వాళ్లూ పెరిగారు. ఇక, ఈ కార్లకు 9999, 6666, 9000 వంటి ఫ్యాన్సీ నంబర్లను తగిలించి ఉండడం గమనించాలి్సన విషయం.

మారిన వేదిక : అమ్మ జయలలిత, పన్నీరు సెల్వం సీఎంగా ఉన్నప్పుడు, సచివాలయం వేదికగా వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవాలు జరిగేవి. తాజాగా, కొత్త సీఎం వేదికను మార్చడం గమనార్హం. ఈ వేదిక నుంచి వీడియో కాన్ఫరెన్స్ తో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, తిరువణ్ణామలై, వేలూరు, కడలూరు, విల్లుపురం జిల్లాల్లో రూ.1,486 కోట్ల మేరకు కొత్త పథకాలకు శంకుస్థాపనలు చేశారు. అలాగే, పలు విభాగాల్లోని అధికారులకు వాహనాల పంపిణీ కార్యక్రమాలు సాగడం గమనార్హం.

మరిన్ని వార్తలు