'తెలుగు భాష విశ్వవ్యాప్తం కావాలి'

19 Oct, 2016 18:14 IST|Sakshi
'తెలుగు భాష విశ్వవ్యాప్తం కావాలి'
- తెలుగు భాషాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పల్లె రఘునాథ్‌రెడ్డి 
 
విజయవాడ : తెలుగు భాష విశ్వవ్యాప్తం కావాలని భాషా సాంస్కృతిక శాఖ మంత్రి, తెలుగు భాషాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు భాషాభిమానులను ఉద్దేశించి మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రాధికార కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. 
 
తెలుగు భాష సంస్కృతి, సంప్రదాయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష అమలు, కళలు, గ్రామీణ క్రీడల అభివృద్ధి కోసం మేధావుల ఆలోచనలు, సూచనలకు కమిటీ తీసుకొని నివేదిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తుందని వివరించారు. తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తెలుగు సంస్కృతి వికాసం, కళా ప్రదర్శనలకు అమరావతి కేంద్రంగా కళాకేంద్రం నిర్మిస్తామని వెల్లడించారు. తెలుగు నేల మీద భాషా సాహిత్య వికాసానికి కృషి చేసిన గొప్పవారి జయంతులు, వర్ధంతులు నిర్వహిస్తున్నామని వివరించారు. అకాడమీలను పునరుద్ధరిస్తామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పాలన భాషగా తెలుగు అమలుకు కృషి చేస్తామన్నారు. 

రాష్ట్రేతర ప్రాంతాల్లోని తెలుగువారు తమ మూలాలను మర్చిపోలేదని, వారికోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ తయారు చేసిందని చెప్పారు. ప్రపంచంలోని తెలుగువారందరూ గర్వపడేలా కమిటీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రాచీన హోదా ద్వారా వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ డి.విజయభాస్కర్, పురావస్తు శాఖ డెరైక్టర్ రామకృష్ణ తదితరులు తెలుగు భాషా వికాసంపై ప్రసంగించారు. 300 మందికిపైగా భాషాభిమానులు చేసిన సూచనలను స్వీకరిస్తూ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని వివరించారు. 
 
>
మరిన్ని వార్తలు