అధికారుల గుండెల్లో రైళ్లు

2 May, 2014 23:57 IST|Sakshi
అధికారుల గుండెల్లో రైళ్లు

- చుక్క నీరు నిలిచినా బాధ్యులను  చేస్తామన్న సర్కార్
 - అవసరమైతే జరిమానాలు విధిస్తామని హెచ్చరిక
 - దీంతో పూడికతీతలు, నీరు నిలిచే ప్రాంతాలపై దృష్టిసారించిన ఇంజనీర్లు
 - వానాకాలానికి సన్నద్ధమవుతున్న కార్పొరేషన్లు

 
న్యూఢిల్లీ: వర్షాకాలానికి దాదాపు రెండు నెలల సమయమున్నా ఎల్జీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తోంది. ఈ వర్షాకాలంలో రోడ్లపై చుక్క నీరు నిలిచినా సంబంధిత అధికారులను, ఇంజనీర్లను బాధ్యులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పనుల విభాగం, సంబంధిత అధికారులు, ఇంజనీర్లను బాధ్యులను చేయడమే కాకుండా వారి నుంచి జరిమానాలు కూడా వసూలు చేయనుంది. గురువారం సమావేశమైన కీలక ప్రభుత్వ విభాగాలు వర్షాకాల ఏర్పాట్ల విషయమై చర్చించాయి. ఈ సమావేశంలో ఆయా మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులతోపాటు వరదలు, నీటిపారుదల విభాగం అధికారులు, ప్రజాపనుల విభాగం అధికారులు పాల్గొని తమ తమ పరిధుల్లో వర్షాకాలంలో తలెత్తే సమస్యలపై సమీక్షించారు.
 
ఢిల్లీలో ప్రస్తుతం ప్రభుత్వమేదీ లేనందున అన్ని విభాగాలకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన జారీ చేసిన ఆదేశాల మేరకే ఆయా ప్రభుత్వ విభాగాలు గురువారం సమావేశమయ్యాయని, వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచిపోవడం పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో దానిపైనే ప్రధానంగా చర్చ జరిపారని తెలిసింది. ఈ సమస్యకు తాము బాధ్యులము కాదంటూ మున్సిపల్ కార్పొరేషన్లు, ప్రజాపనుల విభాగం తప్పించుకునే ప్రయత్నం చేసేవి. దీంతో ఈసారి కూడా అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు దాదాపు రెండు నెలల ముందుగానే సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టారు. ఇందులోభాగంగానే సమస్య తలెత్తితే సంబంధిత అధికారితోపాటు అక్కడి ఇంజనీర్‌ను బాధ్యలను చేసి, వారి నుంచి జరిమానా వసూలు చేయాలని నిర్ణయించారు.
 
‘నగరంలో 153 సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో చిన్నపాటి జల్లులు కురిసినా నీరు నిలిచిపోతుంటుంది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. పరిష్కరించకపోతే ఒక్క వర్షాకాలంలోనేకాకుండా శాశ్వత సమస్యగా మారే అవకాశముంది. ఈ విషయంలో అధికారులను, ఇంజనీర్లను బాధ్యులను చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయి. పరిష్కారానికి అధికారుల వద్ద కూడా తగినంత సమయముంది. ఐటీఓ, వికాస్ మార్గ్, కశ్మీరీ గేట్, సరాయి కాలేఖాన్, ధౌలాకువా, మూల్‌చంద్ ఫేస్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా నీరు నిలుస్తుంటుంది. దీంతో ఈ ప్రాంతానికి చెందిన ఆయా విభాగాల అధికారులు సమావేశమై, పరస్పర సహకారంతో ప్రణాళికలు సిద్ధం చేసుకొని, సమస్య పరిష్కారానికి మార్గాలు అన్వేషించాల’ని రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపనుల విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
 
వానాకాలానికి సన్నద్ధమవుతున్న కార్పొరేషన్
వానాకాలం అనగానే... వేసవి ఎండల తాకిడికి వాడిపోయిన ముఖాల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరుస్తుంది. కానీ ఢిల్లీ నగరం మాత్రం ఇందుకు మినహాయింపు. కారణం... వానలతో పాటు ఇక్కడి వాళ్లకు సమస్యలూ వరదల్లా రావడమే. అస్థవ్యస్తమైన డ్రైనేజ్ వ్యవస్థ, మురికి, బురద, ఎక్కడ చూసినా నిలిచిన  వరద నీరు...  ఇలా వర్షాకాలం రాగానే ఢిల్లీ సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతుంది. ఇందుకు ప్రధాన కారణం... నగరంలోని డ్రైనేజ్ వ్యవస్థ అతి పురాతనమైనది కావడం, అంతసమర్థవంతమైనది కాకపోవడం. దీంతో వర్షపు నీరు బయటకు పోలేక కాలనీల్లోనే నిలిచిపోతుంది.
 
 వర్షాకాలంలో నగరం నీటి ప్రపంచాన్ని తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు. నీటిపారుదల, వరద నివారణ శాఖ, ఢిల్లీ మున్సిపల్ కర్పొరేషన్ సంయుక్తంగా నీరు నిలవకుండా ఉండేందుకు, వరద నీటిని అదుపు చేసేందుకు ప్రతి ఏటా ముందస్తు చర్యలు తీసుకుంటూనే ఉంటారు. ఇందులో భాగంగా వర్షపు నీటి కాలువల శుద్ధి, మరమ్మతులు, నీటి పైపులను శుద్ధి, మరమ్మతులు, నగరంలోని 12 మున్సిపల్ జోన్లలో కంట్రోల్ రూమ్‌లు కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఈసారి వర్షాకాలాన్ని ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని ఈశాన్య మున్సిల్ కార్పొరేషన్ అధికార ప్రతినిధి యోగేంద్రమన్ తెలిపారు. ‘ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యవేక్షణ ప్రారంభించాం. నిలిచిపోయిన నీటిని తోడి పారబోయడానికి కొత్త పంపులను కూడా ఏరాపటు చేశాం.
 
 ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం 24 గంటలు పనిచేసే కంట్రోల్‌రూమ్‌లను కూడా ఏర్పాటు చేశామని యోగేంద్ర చెప్పారు. అన్ని విభాగాలు కలిసి ఈ ఏడాది వానాకాలంలో వచ్చే సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటామని, జూన్ 15కల్లా పనులన్నింటినీ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. అయితే డ్రైనేజ్ కాలువల్లో ప్లాస్టిక్ బ్యాగులు పడేయకుండా ఉండాలని యోగేంద్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 ఢిల్లీలోని ఆజాద్ మార్కెట్ ఏరియా, బరఫ్ ఖానా చౌక్, ఐఎస్‌బీటీ కష్మీరీ గేట్, రైల్వేబ్రిడ్జ్, సబ్జీమండీ, షాద్రా, జేజే బులంద్ మసీదు, మానస సరోవర్ పార్క్, బాదర్‌పూర్ రోడ్, ఖిచ్రిపూర్, మండవలిలను అత్యంత దుర్భలమైన ప్రాంతాలుగా గుర్తించింది కార్పొరేషన్. చిన్నవర్షం పడినా చిత్తడిగా మారే ఈ ప్రాంతాలపై దృష్టి సారించింది.

>
మరిన్ని వార్తలు