పన్నీర్‌ దీక్ష

9 Mar, 2017 02:48 IST|Sakshi

కుట్రపూరిత కుటుంబం నుంచి రక్షిద్దాం
మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రతిజ్ఞ
జయ మరణంపై న్యాయ విచారణ కోరుతూ రాష్ట్రవ్యాప్త దీక్షలు


అమ్మకు ద్రోహం చేసి, బహిష్కరణకు గురైన వారి చేతిలో నేడు అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వం చిక్కుకున్నాయని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ ఆశయాలకు విరుద్ధమైన వ్యక్తుల నుంచి అన్నాడీఎంకేను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తూ పన్నీర్‌సెల్వం బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. పన్నీర్‌కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరం నుంచి పన్నీర్‌ ప్రసంగిస్తూ ఎంజీఆర్‌ అన్నాడీఎంకేను ఒక మక్కల్‌ ఇయక్కం(ప్రజల సంస్థ)గా స్థాపించారన్నారు. ఆయన బాటలో జయలలిత సైతం ‘ప్రజల కోసం నేను... ప్రజల వల్ల నేను’ అనే నినాదంతో పాలన అందించారని తెలిపారు. జయ స్థానంలో సీఎంగా తాను సైతం అలాంటి పాలనకే పాటుపడ్డానని చెప్పారు.

అయితే రాష్ట్రంలో నేడు అలాంటి పరిస్థితులు లేవని, అమ్మ ఆశయాలు తల్లకిందులయ్యాయని అన్నారు. అమ్మ చేతిలో బహిష్కరణకు గురైన వారంతా పార్టీ, ప్రభుత్వ పెద్దలుగా మారిపోయారని చెప్పారు. ‘అక్కా... నీకు ద్రోహం చేసినవారితో ఇక నా సంబంధాలు తెంచుకుంటాను, రాజకీయాలు, పార్టీ, పదవులకు దూరంగా ఉంటాను’ అని లిఖిత పూర్వకంగా జయ వద్ద క్షమాపణలు కోరిన శశికళ వ్యవహారం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అమ్మ బహిష్కరించిన వారి చేతిలో నుంచి పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడేందుకే ధర్మయుద్ధాన్ని ప్రారంభించానని పన్నీర్‌ సెల్వం వివరించారు.

అమ్మను చూసేందుకు అడ్డుకున్నారు
అపోలో ఆసుపత్రిలో జయకు 74 రోజుల పాటూ చికిత్స అందిస్తే ఒక్కరోజు కూడా తాను చూసేందుకు అవకాశం కలగలేదని, ఎన్నోసార్లు ప్రయత్నించినా శశికళ, ఆరోగ్య మంత్రి విజయభాస్కర్‌ మనుషులు అడ్డుకున్నారని తెలిపారు. అపోలోకు వచ్చేపోయే వారి జాబితాను సిద్ధం చేసేందుకే ఆరుగురిని నియమించారని చెప్పారు. చిన్నపాటి వ్యాధులతో అడ్మిటైన అమ్మకు సుదీర్ఘకాలం వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏమిటి, సంక్లిష్టమైన వ్యాధులపై చికిత్సకు విదేశాలకు తరలించాలని తాను సూచించినా శశికళ పట్టించుకోలేదని చెప్పారు.

జయ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సంగతిని ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకువచ్చానని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌ చేసిన ప్రకటన సత్యదూరమని పన్నీర్‌సెల్వం అన్నారు. ఆయన  ఆ ప్రకటనను ఉపసంహరించుకోకుంటే కోర్టులో కేసు దాఖలు చేస్తానని హెచ్చరించారు. జయ మరణంలోని మర్మంపై కేంద్ర ప్రభుత్వ పరిధిలో న్యాయ విచారణ లేదా సీబీఐ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు.

దీక్షలకు భారీ స్పందన
సీఎంగా రాజీనామా చేసిన నాటి నుంచి అమ్మ మరణం అనుమానాస్పదమేనని చెబుతూ వస్తున్న పన్నీర్‌సెల్వం ఏకంగా నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకోవడం అధికార అన్నాడీఎంకే వర్గాన్ని కలవరపెట్టింది. గత నెల 27వ తేదీనే దీక్షకు దరఖాస్తు చేసుకున్నా పోలీసులు అనుమతించలేదు. దీంతో రెండు రోజుల క్రితం మరోసారి దరఖాస్తు చేసుకుని అనుమతి పొందారు. చెన్నై చేపాక్‌ స్టేడియం వద్ద తలపెట్టిన దీక్షను ఎగ్మూరులోని రాజారత్తినం స్టేడియంకు మార్చారు. బుధవారం ఉదయం 10 గంటలకు దీక్షలు ప్రారంభించాల్సి ఉండగా 9 గంటలకే పన్నీర్‌సెల్వం ఆయన మద్దతుదారులతో కలసి చేరుకున్నారు.

అప్పటికే భారీ సంఖ్యలో జనసందోహం ఏర్పడింది. సరిగ్గా 10 గంటలకు పన్నీర్‌సెల్వం దీక్షలను ప్రారంభించారు. పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు దీక్షా శిబిరం నుంచి చేసిన ప్రసంగాల్లో అమ్మ పాలనను వివరిస్తుండగా పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజానీకం, ముఖ్యంగా మహిళలు కన్నీరు పెట్టారు. పన్నీర్‌సెల్వం వైపు ధర్మం ఉందని నటుడు మనోబాల తనను కలిసిన మీడియా వారితో అన్నారు. చెన్నై శివార్లు ఆవడి, సేలం, నామక్కల్, కోయంబత్తూరు, నాగర్‌కోవిల్, తిరుచ్చిరాపల్లి, అరియలూరు తిరునెల్వేలి, తూత్తుకూడి, తంజావూరు, తిరువారూరు, ఈరోడ్, మధురై, వేలూరు, కడలూరు, విళుపురం తదితర మొత్తం 32 జిల్లాల్లో సైతం పన్నీర్‌సెల్వం అనుచరులు నిరాహార దీక్షలు నిర్వహించారు. ప్రతిచోట పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు పెట్టారు.

చికిత్స పత్రాలను వెల్లడించాలి: దీప
జయకు అపోలో ఆసుపత్రిలో అందించిన పలురకాల చికిత్సలకు ముందు అనుమతి పత్రాలపై సంతకాలు పెట్టినవారి పేర్లు బయటపెట్టాలని ఆమె మేనకోడలు, ఎంజీఆర్‌ అమ్మ దీప పేరవై అధినేత్రి దీప బుధవారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్‌ చేశారు. అలాగే జయ మరణ ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించేందుకు సంతకం చేసిన కుటుంబ సభ్యులెవరో తేలాల్సి ఉందని ఆమె అన్నారు. ఆసుపత్రిలో రోగికి చికిత్స ప్రారంభించే ముందు బంధువులతో సంతకం తీసుకోవడం ఆనవాయితీ, దీని ప్రకారం వీటన్నింటిపై సంతకం చేసిన వారు ఎవరో తేలేందుకు, మరణంపై నెలకొన్న అనుమానాల నివృత్తి కోసం న్యాయ విచారణ అవసరమని ఆమె అన్నారు.

మరిన్ని వార్తలు