రుణాలు రద్దు చేయండి

20 May, 2017 01:55 IST|Sakshi
రుణాలు రద్దు చేయండి

► నీట్‌ పరీక్ష నుంచి మినహాయించాలి
► ప్రధాని మోదీకి పన్నీర్‌ వినతి
► కేంద్రంతో సాన్నిహిత్యానికి పన్నీర్‌ ప్రయత్నాలు


అతివృష్టి,అనావృష్టిలతో అల్లాడుతున్న అన్నదాతలను ఆదుకోవాలని, వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే నీట్‌ ప్రవేశపరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని ఆయన కోరారు. పనిలో పనిగా రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రధానికి వివరించినట్లు సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు పన్నీర్‌సెల్వం తన వర్గం ఎంపీలతో కలిసి గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకుని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలోని ఇరువర్గాల విలీన ప్రయత్నాలు విఫలం కావడంతో అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం పొందడంపై నేతలు దృష్టిపెట్టారు. పన్నీర్‌వర్గం వైపు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తారని ఆశించారు. అయితే కేవలం 12 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు మాత్రమే పన్నీర్‌వైపు ఉన్నారు. అలాగే  సీఎం ఎడపాడి పళనిస్వామి వర్గంలో 123 మంది ఎమ్మెల్యేలు, 35 మంది ఎంపీలు ఉన్నా రు. అయితే టీటీవీ దినకరన్‌ను పార్టీకి దూరం పెట్టడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న కొందరు ఎమ్మెల్యేలు ఎడపాడి పట్ల విముఖతతో తిరుగుబాటు ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఎడపాడి ప్రభుత్వానికి ఏక్షణమైనా ప్రమాదం ఏర్పడవచ్చని కొందరు అంచనావేస్తున్నారు.

అన్నాడీఎంకేలో విబేధాలు పొడచూపిన నాటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నీర్‌సెల్వం వైపు నిలిచింది. శశికళపై పలురకాల ఒత్తిడి తెచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లో కేంద్రం తలదూర్చలేదని బీజేపీ రాష్ట్ర నేతలు ఖండించారు. అయినా, ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలు రద్దు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌ ఆస్తులపై ఐటీ దాడులు తదితర పరిణామాలు శశికళ వర్గానికి కేంద్రం వ్యతిరేకమని భావించేలా చేశారు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా సీఎం ఎడపాడి, మంత్రులు ఢిల్లీ బాటపట్టి ప్రధాని, కేంద్ర మంత్రులను కలుసుకున్నారు.

రాష్ట్రపతి ఎన్నికలకు పూర్తి మద్దతిస్తామని సీఎం ఎడపాడి ఢిల్లీ పెద్దలకు హామీ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో కేంద్రం సైతం ఎడపాడి ప్రభుత్వానికి అండగా నిలవడం ప్రారంభించింది. ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నట్లుగా సీఎం ఎడపాడి సైతం రాష్ట్రంలో జరిగే సభల్లో కేంద్రాన్ని పొగడడం ప్రారంభించారు. మెట్రోరైలు ప్రారంభోత్సవానికి హాజరైన కేంద్రం మంత్రి వెంకయ్యనాయుడు ఏకంగా సచివాలయానికి వెళ్లి సమీక్ష నిర్వహించారు.

పన్నీర్‌ వర్గం భీతి: ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్యాపరంగా ఇప్పటికే బలహీనంగా ఉన్న పన్నీర్‌సెల్వం వర్గం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సఖ్యత వల్ల భీతి నెలకొంది. తమవైపు ఉన్న ఆ కొద్ది మంది కూడా ఎడపాడి వైపు వెళ్లిపోతారనే అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పన్నీర్‌ వర్గానికి చెందిన ఎంపీ మైత్రేయన్‌ బీజేపీ నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. అలాగే మోదీతో సాన్నిహిత్యం చేజారిపోకుండా పన్నీర్‌సెల్వం సైతం జాగ్రత్తపడుతున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి 11.40 గంటలకు విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

పన్నీర్‌సెల్వం ఢిల్లీ పయనాన్ని గోప్యంగా ఉంచారు. పన్నీర్‌తోపాటు మాజీ మంత్రి కేపీ మునుస్వామి, ఎంపీ మైత్రేయన్‌ వెళ్లారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుని వినతి పత్రం సమర్పించారు. రైతుల వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని, తమిళనాడు ప్రజల అభీష్టాన్ని మన్నించి నీట్‌ ప్రవేశపరీక్షను మినహాయించాలని కోరారు. రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రధానితో సంభాషించినట్లు సమాచారం. అలాగే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించాలని, రెండాకుల చిహ్నాన్ని తమకు కేటాయించాలని ఈసీని కోరినట్లు తెలిసింది. శశికళ, ఆమె కుటుంబ సభ్యులను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తేనే విలీనంపై ఆలోచిస్తామని ఢిల్లీ మీడియాతో పన్నీర్‌సెల్వం వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు