ఢిల్లీకి రండి !

25 Oct, 2015 10:22 IST|Sakshi
ఢిల్లీకి రండి !

బెంగళూరు:  రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, పునఃరచన విషయమై మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఈ విషయంపై కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణతో సమావేశమయ్యారు. ఇక మంత్రి వర్గ విస్తరణపై చర్చించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా పరమేశ్వర్‌కు హైకమాండ్ నుంచి పిలుపు అందింది. దీంతో శనివారం సాయంత్రమే కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి. పరమేశ్వర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
 
దసరా పండుగ అనంతరం మంత్రివర్గ విస్తరణ చేపడతామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన కంటే ముందు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేడు (ఆదివారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ చేరుకున్న  అనంతరం రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, పునఃరచన విషయాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైకమాండ్‌తో చర్చించనున్నారు.
 
కాగా, ఇదే సందర్భంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్‌కు సైతం కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు అందింది. మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు దిల్లీకి రావాల్సిందిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ నుంచి పరమేశ్వర్‌కు పిలుపు అందింది. దీంతో శనివారం సాయంత్రమే పరమేశ్వర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
 
ఎస్.ఎం.కృష్ణతో భేటీ...
కాగా, ఢిల్లీ బయలుదేరి వెళ్లడానికి ముందు కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణతో భేటీ అయ్యారు. శనివారం ఉదయమిక్కడి ఎస్.ఎం.కృష్ణ నివాసానికి చేరుకున్న పరమేశ్వర్ మంత్రి వర్గ విస్తరణతో పాటు తన ఢిల్లీ పయనంపై చర్చించారు. ఎస్.ఎం.కృష్ణతో, జి.పరమేశ్వర్ భేటీ కావ డం కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కుతూహలాన్నే రేకెత్తిస్తోంది. రాష్ట్ర రాజకీయాలపై హైకమాండ్‌తో చర్చించేందుకు గాను ఎస్.ఎం.కృష్ణ సైతం ఇటీవలే ఢిల్లీ వెళ్లి వచ్చారు.
 
దీంతో పరమేశ్వర్, ఎస్.ఎం.కృష్ణల భేటీపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. కాగా, ఈ సమావేశం అనంతరం పరమేశ్వర్ విలేకరులతో మాట్లాడుతూ....ఎస్.ఎం.కృష్ణతో తాను సమావేశం కావడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వివరించారు. కేవలం ఆయనతో వ్యక్తిగత విషయాలు మాట్లాడేందుకు మాత్రమే తాను వచ్చానని చెప్పారు. ఇక ఉప ముఖ్యమంత్రి పదవికి సంబంధించి హైకమాండ్‌దే తుది నిర్ణయమని పరమేశ్వర్ తెలిపారు.
 
ఎస్.ఎం.కృష్ణ ఇంటి వద్ద బారులుతీరిన ఆశావహులు...
ఇక మంత్రి వర్గ విస్తరణ తుది ఘట్టానికి చేరుకున్న నేపథ్యంలో మంత్రి వర్గంలో స్థానాన్ని ఆశించే ఆశావహులంతా ఎస్.ఎం.కృష్ణ ఇంటి వద్ద బారులు తీరారు. తమకు మంత్రివర్గంలో స్థానం ఇప్పించాల్సిందిగా సిఫార్సు చేయాలని కోరేందుకు వీరంతా ఎస్.ఎం.కృష్ణ ఇంటికి చేరుకుంటున్నారు. దసరా శుభాకాంక్షలు తెలియజేసేందుకు అంటూ ఎస్.ఎం.కృష్ణ ఇంటికి చేరుకుంటున్నారు. కాగా, ఎస్.ఎం.కృష్ణను కలిసిన ఆశావహుల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి సైతం ఉన్నారు.
 

మరిన్ని వార్తలు