విద్యార్థినులను మోకాళ్లపై కూర్చోబెట్టి దండన

7 Apr, 2018 07:38 IST|Sakshi
పాఠశాల ముందు రాస్తారోకో చేస్తున్న తల్లిదండ్రులు

పాఠశాలకు బొట్టు, పూలు పెట్టుకెళ్లారని ఘటన

పాఠశాలను ముట్టడించిన విద్యార్థినుల తల్లిదండ్రులు

తిరువణ్ణామలై: ఓ ప్రైవేట్‌ పాఠశాలకు బొట్టు, పూలు పెట్టుకెళ్లిన విద్యార్థినులను మోకాళ్లపై నిలబెట్టడాన్ని ఖండిస్తూ తల్లిదండ్రులు, హిందూ మున్నని కార్యకర్తలు ఆ పాఠశాల ముందు శుక్రవారం రాస్తారోకో చేశారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా సేత్తుపట్టు సమీపంలోని దేవికాపురంలో ఓ ప్రైవేట్‌ క్రైస్తవ మెట్రిక్‌ పాఠశాల ఉంది. ఇక్కడ సుమారు ఐదు వేల మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలకు పూలు, బొట్టు పెట్టుకోవద్దని నిబంధనలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దేవికాపురానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గురువారం ఉదయం బొట్టు, పూలు పెట్టుకొని పాఠశాలకు వెళ్లారు. గమనించిన టీచర్‌ వాటిని తొలగించాలని తెలిపడంతో వారు పూలు, బొట్టును తొలగించారు. దీంతో వారిని పాఠశాల ఆవరణంలో మోకాళ్లపై నిలబెట్టారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు తల్లిదండ్రులకు ఈ విషయం తెలిపారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు.

నిబంధనలు పాటించనందుకే దండన..
పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా రావడంతోనే ఇలా చేశామని పాఠశాల యాజమాన్యం తెలిపింది. దీంతో పాఠశాల యాజమాన్యంతో తల్లిదండ్రులు వాగ్వాదం చేశారు. విషయం తెలుసుకున్న హిందూ మున్నని కార్యకర్తలు పాఠశాల వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలూరు డీఎస్పీ చిన్నరాజ్, పోలీసులు తల్లిదండ్రులతో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింప జేశారు. పోలీసులు పాఠశాల యాజమాన్యం వద్ద విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు