నర్సరీ అడ్మిషన్ల కేసు ఎడతెగని నిరీక్షణ

12 Apr, 2014 22:33 IST|Sakshi
నర్సరీ అడ్మిషన్ల కేసు ఎడతెగని నిరీక్షణ
కొన్ని నెలలుగా కొనసాగుతున్న నర్సరీ అడ్మిషన్ల వ్యవహారం ఎంతకూ తెగకపోవడంతో పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే జూలై వరకు తరగతులు మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదని కొంతమంది ప్రిన్సిపాల్స్ అంటున్నారు. 
 
 న్యూఢిల్లీ:నర్సరీ అడ్మిషన్లు పొందిన చిన్నారులకు ఈ నెల 15 నుంచి తరగతులు మొదలవుతాయని పాఠశాలల యాజమాన్యాలు శుక్రవారం దాకా ఈ-మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందించాయి. అయితే శుక్రవారం మధ్యాహ్నం తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అడ్మిషన్ల ప్రక్రియపై స్టే విధిస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించడంతో అటు పాఠశాలల యాజమాన్యాలు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయానికి గురయ్యారు. అడ్మిషన్ల పాయింట్ల కేటాయింపుపై జనవరి నుంచి కొనసాగుతున్న వివాదాలు, కోర్టు కేసులు ఎంతకీ తేలకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అడ్మిషన్ల ప్రక్రియలో తరచూ మార్పులు చేయడంపై అంతటా నిరసన వ్యక్తమవుతోంది. పాయింట్ల కేటాయింపు, డ్రాల నిర్వహణపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో న్యాయస్థానాల జోక్యం అనివార్యమయింది.
 
  తాజాగా కోర్టు ఆదేశాల మేరకు అడ్మిషన్ల ప్రక్రియను నిలిపి వేస్తున్నట్టు టీచర్లు మళ్లీ సమాచారం పంపించారు. అంతర్రాష్ట్ర బదిలీల (ఐఎస్టీ) ద్వారా పాయింట్లు వచ్చిన విద్యార్థులకు మినహా మిగతా వాళ్లందరికీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించాలని ఢిల్లీ హైకోర్టు ఈ నెల మూడున మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఐఎస్టీ పాయింట్ల వివాదంపై ఈ నెల 16న విచారణ స్వీకరిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మొత్తం ప్రక్రియనే తాత్కాలికంగా నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ‘మా పాఠశాలలోనే 225లో 124 సీట్లను ఇది వరకే భర్తీ చేశాం. కొందరైతే యూనిఫారాలు, పుస్తకాలు కూడా కొనుగోలు చేసి ఫీజులూ చెల్లించారు. మా విద్యార్థుల చెల్లెళ్లు/తమ్ముళ్లకు కూడా కొన్ని సీట్లు ఇచ్చాం.
 
  70 పాయింట్లు వచ్చినా, సీట్లు దక్కని వారి గురించే ఆందోళనగా ఉంది’ అని పీతంపురాలోని మహారాజ అగ్రసేన్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మంచిదేనని, అది తుది నిర్ణయం తీసుకునే వరకు యాజమాన్యాలు కచ్చితంగా నిరీక్షించాలని స్ప్రింగ్‌డేల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ అమితాముల్లా వట్టల్ అన్నారు. ఐఎస్టీ పాయింట్లను ఫిబ్రవరి 27న రద్దు చేసిన తరువాత నుంచి ఇప్పటి వరకు తాము డ్రాలు నిర్వహించలేదని తెలిపారు. సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేదాకా తరగతులు నిర్వహించే ప్రశ్నే లేదని ఆమె స్పష్టీకరించారు. వికలాంగులకు పాయింట్ల కేటాయింపుపైనా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. లక్ష్మణ్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉషారామ్ మాట్లాడుతూ 70 పాయింట్లే ఉన్న చిన్నారులకు అడ్మిషన్లు ఇవ్వకపోవడమే మంచిదయిందని, లేకుంటే ఇబ్బందులు ఎదురయ్యేవని అన్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు తరగతులు ప్రారంభించినా, కోర్టు స్టే మేరకు నిలిపివేశామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జూలై వరకు తరగతులు మొదలయ్యే అవకాశాలు లేవని మరో ప్రిన్సిపాల్ అన్నారు.
 
 స్థానిక కోటాలో 70 పాయింట్లు సాధించిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడానికి తాజాగా డ్రాలు నిర్వహించాలంటూ ఈ నెల ఆరున కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ చిన్నారులకు డ్రాలో ఇది వరకే అడ్మిషన్లు వచ్చాయని, కోర్టు ఆదేశాల మేరకు మరోసారి డ్రా తీస్తే మళ్లీ మొదటి నుంచీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుందని బెంచ్‌కు విన్నవించారు. తల్లిదండ్రులు వేరే రాష్ట్రాల నుంచి ఢిల్లీకి బదిలీ అయితే, వాళ్ల పిల్లలకు ఐదు పాయింట్లు కేటాయించడాన్ని రద్దు చేస్తూ గత నెల 27న లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేయడంతో ఈ వివాదం మొదలయింది. సంబంధిత పాఠశాలకు ఎనిమిది కిలోమీటర్ల లోపు నివసించే చిన్నారులకు 70 పాయింట్లు కేటాయిస్తారు. ఇది వరకే 70 పాయింట్లతో అడ్మిషన్లు దక్కించుకున్న చిన్నారులకు మళ్లీ డ్రాలు అవసరం లేదని ఎల్జీ పేర్కొన్నారు. 70 పాయింట్లతో వెయిటింగ్ లిస్టులో ఉండి, అంతర్రాష్ట్ర బదిలీల వల్ల 75 పాయింట్లు వచ్చిన వారి పేర్లను డ్రాలో చేర్చాలని ఆదేశించారు. అయితే అందరు చిన్నారులకూ తాజాగా డ్రాలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈ నెల ఆరున జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీనివల్ల తమకు నష్టం జరుగుతుందని ఇది వరకే అడ్మిషన్లు దక్కిన బాలల తల్లిదండ్రులు వాదించారు. 
 
 తాజా వివాదం
 ఐఎస్టీ తల్లిదండ్రుల పిల్లలకు ఐదు పాయింట్లు కేటాయించడాన్ని రద్దు చేస్తూ గత నెల 27న లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఐఎస్టీలకు పాయింట్లు ఇవ్వడం వల్ల తన కక్షిదారుల చిన్నారులకు డ్రాల్లో సీట్లు వచ్చాయని, అయితే ఈ విధానాన్ని  రద్దు చేయడంతో వారంతా సీట్లను ఖాళీ చేయాల్సి వస్తోందని బాధిత తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆదేశించడంతో తాజాగా స్టే జారీ అయింది.  ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం మొత్తం 100 పాయింట్లలో స్థానిక విద్యార్థులకు (నైబర్‌హుడ్) 70 కేటాయిస్తారు. ఇది వరకే స్కూల్లో చదువుతున్న విద్యార్థి తోబుట్టువులు దరఖాస్తు చేసుకుంటే వారికి 20 పాయింట్లు ఇస్తారు. తల్లిదండుల్లో ఎవరో ఒకరు సదరు పాఠశాల పూర్వ విద్యార్థులు అయితే దరఖాస్తుదారుడికి ఐదు పాయింట్లు ఇస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి (అంతరాష్ట్ర బదిలీలు) వచ్చి అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఐదు పాయింట్లు కేటాయించాలనుకున్నా, ఇవి దుర్వినియోగం అవుతాయని ఫిర్యాదులు రావడంతో రద్దు చేశారు. 75 నుంచి 100 మధ్య పాయింట్ల మధ్య వచ్చిన వారి పేర్లు మాతమే అడ్మిషన్ల కోసం తీసే డ్రాలో ఉంచుతారు. 90 పాయింట్లు వచ్చిన వారికి కచ్చితంగా అడ్మిషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
 
 అడ్మిషన్లపై కమిటీ వేయాలని విజ్ఞప్తి
 ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు అత్యున్నతస్థాయి కమిటీని నియమించాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు రాష్ట్ర బీజేపీ శనివారం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ జగ్‌కు లేఖ రాశారు. ఇది రోజువారీగా అడ్మిషన్ల ప్రక్రియను పరిశీలిస్తూ ఎల్జీకి నివేదిక సమర్పించాలని అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాల్లోనూ 6-14 ఏళ్ల లోపు విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్లు ఇవ్వాలని లేఖలో వర్ధన్ పేర్కొన్నారు. అన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ పేద విద్యార్థులకు 24 శాతం సీట్లు కేటాయించడం తప్పనిసరని తెలిపారు. ఇలాంటి వారి నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ డొనేషన్లు లేదా ఇతర రూపంలో డబ్బులు వసూలు చేయవద్దని కోరారు. నిబంధనలను ఉల్లంఘించిన పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్షవర్ధన్ సదరు లేఖలో కోరారు. 
 
 
మరిన్ని వార్తలు