నిజంగా పరోటా సూరినే..!

11 Aug, 2016 11:23 IST|Sakshi
నిజంగా పరోటా సూరినే..!

42 పరోటాలు తిని రూ.5001 బహుమతి కైవసం
 
 తిరువొత్తియూరు: మీరైతే సాధారణంగా ఎన్ని పరోటాలు తినగలరు. మహా ఐతే ఓ అయిదారు. అంతకంటే ఎక్కువ తినాలంటే కష్టమే. అయితే నెల్లై జిల్లాలో ఓ యువకుడు ఏకంగా 42 పరోటాలు తిని రూ.5001 నగదును బహుమతిగా పొందాడు. వెన్నెలా కబడి కుళు చిత్రంలో నటుడు సూరి పరోటా తిన్న దృశ్యం ఎప్పుడు చూసినా మనల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ ఒక్క దృశ్యంతో నటుడు సూరి, పరోటా సూరిగా మారిపోయాడు.

తమిళనాటలో పరోటాకు ప్రాధాన్యత ఎక్కువే. ఇదే తరహాలో పరోటా ప్రియులను ఆకర్షించేందుకు నెల్లై జిల్లా కల్లిడై కురిచ్చిలోని ఓ హోటల్‌లో వింత పోటీ నిర్వహించారు. నమ్మ ఊరు పరోటా సూరి యార్?(మన ఊరి పరోటా సూరి ఎవరు?) అనేది పోటీ పేరు. అందరికంటే ఎక్కువ పరోటాలు తిన్న వారికి రూ.5001 నగదు బహుమతి అందజేయనున్నట్టు హోటల్ యజమాని ప్రకటించాడు.

దీనిపై ఆ ప్రాంతంలో పోస్టర్‌లు అతికించారు. దీన్ని సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసిన కొందరు తమ స్నేహితులకు వాట్సాప్‌లో పంపడంతో ఈ పోటీకి మంచి ప్రచారం వచ్చింది. ఈ పోటీ మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగింది. పలు గ్రామాలకు చెందిన ప్రజలు అక్కడికి చేరుకుని పోటీ పడి మరి పరోటాలు లాగించారు. అయితే పదికి మించి ఎవరూ తినలేకపోయారు. శివగంగైకు చెందిన కాదర్ మైదీన్ అనే యువకుడు ఏకంగా 42 పరోటాలను లాగించి ‘పరోటా సూరి’గా పేరుపొందాడు. దీంతో హోటల్ యజమాని ప్రకటనలో తెలిపిన విధంగా అతనికి నగదును బహుమతిగా అందజేశాడు.

మరిన్ని వార్తలు