పా(డి)డు చేయొద్దు

1 Jul, 2014 02:55 IST|Sakshi
  • సామాజిక వర్గాల మధ్య తేడా చూపరాదని బీజేపీ హితవు
  •  రైతులందరికీ వర్తింపజేయాలని డిమాండ్
  •  ఎస్సీ, ఎస్టీ నిధుల వినియోగంపై అభ్యంతరం లేదన్న విపక్షం
  •  ప్రోత్సాహకంపై పాలక పక్షానికి  జేడీఎస్ మద్దతు
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఎస్‌సీ, ఎస్‌టీ రైతులకు ప్రభుత్వం లీటరుకు రూ.2 చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రకటించడం సోమవారం శాసన సభలో పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఒకానొక దశలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్‌లు సవాళ్లు విసురుకున్నారు. ఈ సందర్భంగా సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రికి  దళితులపై అంత ప్రేమ ఉంటే కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరను ఉప ముఖ్యమంత్రిని చేయాలని శెట్టర్ సవాలు విసిరారు.

    జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ ఎస్‌సీ. ఎస్‌టీ పాడి రైతులకు రూ.2 చొప్పున ప్రోత్సాహకాన్ని ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. సామాజిక వర్గాల మధ్య తేడా చూపడం ప్రభుత్వానికి సరికాదని హితవు పలుకుతూ, అన్ని వర్గాల రైతులకు ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఎస్‌సీ, ఎస్‌టీ రైతులకు ప్రోత్సాహకాన్ని ఇచ్చే ప్రతిపాదన పరిశీలన దశలో ఉందని, ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర వివరణ ఇచ్చారు.

    ఈ దశలో అధికార పార్టీకి చెందిన సభ్యులు కల్పించుకుంటూ బీజేపీ దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేయడం సరికాదని అన్నారు. బీజేపీ సభ్యులు కూడా లేచి నిల్చుని వారితో వాదనకు దిగారు. ఈ గందరగోళం మధ్యే జయచంద్ర మాట్లాడుతూ ఎస్‌సీ, ఎస్‌టీల సంక్షేమానికి కేటాయించిన రూ.200 కోట్లలో రూ.93 కోట్లు మాత్రమే ఖర్చయిందని వెల్లడించారు. మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేయాలనే ఉద్దేశంతోనే ప్రోత్సాహకం ప్రతిపాదన వచ్చిందని చెప్పారు.

    బీజేబీ సభ్యుడు సీటీ. రవి దీనికి అభ్యంతరం చెబుతూ, ఎస్‌సీ, ఎస్‌టీలకు భూములు, ఆవులను ఇవ్వండని సూచిస్తూ, ఆ వర్గాలకు కేటాయించిన నిధులను ఖర్చు  చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని చెప్పారు.  ఈ దశలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వారికి కేటాయించిన నిధులున్నప్పుడు, ప్రోత్సాహకం ఇస్తే తప్పేమిటని అన్నారు. దీని వల్ల సామాజిక వర్గాల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలున్నాయని శెట్టర్ ఆందోళన వ్యక్తం చేస్తూ, రైతులందరికీ ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.

    దీనిపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘సమాజంలో అసమానతలను ృష్టించిందే’ మీరే అంటూ, ఎస్‌సీ, ఎస్‌టీలకు ప్రోత్సాహకం ఇస్తే కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. ఈ సందర్భంగా శెట్టర్, సీఎంలు పలుమార్లు సవాళ్లు విసురుకున్నారు. సభ అదుపు తప్పుతోందని గ్రహించిన స్పీకర్ కాగోడు తిమ్మప్ప సభ్యులను శాంతింపజేశారు. అనంతరం మాట్లాడిన జేడీఎస్ సభ్యుడు వైఎస్‌వీ. దత్తా ఎస్‌సీ, ఎస్‌టీలకు రూ.2 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వడంపై ప్రభుత్వం వెంటనే ఆదేశాలు జారీ చేయాలని, దీనికి తమ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు.
     

మరిన్ని వార్తలు