నాటి బ్యూటీస్ నేటి ఆంటీస్‌గా...

23 Dec, 2014 02:18 IST|Sakshi
నాటి బ్యూటీస్ నేటి ఆంటీస్‌గా...

పాత్రల ప్రాముఖ్యత, పరిధిల్లో ట్రేడ్ ఉండవచ్చునేమో గానీ సినిమాల్లో నాయికానాయకులు లేని చిత్రాలు అరుదే. కమర్షియల్ అంశాలకు హీరో ఎంత అవసరమో కనువిందు చేయడానికి హీరోయిన్ అంతే అవసరం. కొన్ని చిత్రాల్లో హీరోయిన్లు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు. అలా అందం, అభినయంతోను తమ సత్తా చాటి ప్రముఖ కథానాయికలుగా రాణించిన పలువురు తరువాత వివాహ బంధాలతో సంసార జీవితంలోకి వెళ్లిపోయూరు. కొంతకాలం పాటు మాతృత్వ మాధుర్యాన్ని చవిచూశారు.
 
 పిల్లా పాపలతో సుఖ సంతోషాలను అనుభవించి, మళ్లీ నటనపై దృష్టి సారిస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఏదేమైనా నాడు బ్యూటీస్‌గా వెలుగొందిన భామలు నేడు ఆంటీస్‌గా రాణిస్తున్నారు. మరి కొందరు ఆ ప్రయత్నంలో ఉన్నారు. వీరిని ఒక్కసారి పరిశీలిస్తే అతిలోక సుందరి బిరుదు సొంతం చేసుకున్న శ్రీదేవితోపాటు నదియ, మనీషా కొయిరాలా, గౌతమి, మధుబాల, అమల, తులసి, జ్యోతిక, అభిరామి, కిరణ్‌రాథోడ్, ప్రియా ఆనంద్, లైలా తదితరులు సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి పాత్రల్లో అలరించడానికి రెడీ అయ్యారు.
 
 గౌతమి పునరాగమనం
 పదహారణాల తెలుగమ్మాయి గౌతమి తమిళంలో వర్ధమాన నటుల నుంచి సూపర్‌స్టార్ రజనీకాంత్ కమలహాసన్ వరకు జోడి కట్టి ప్రముఖ హీరోయిన్‌గా రాణించారు. ఆ తరువాత కొంతకాలం నటనకు దూరంగా వున్న గౌతమి తాజాగా తాను సహజీవనం చేస్తున్న నటుడు కమలహాసన్‌తోనే. పాపనాశం చిత్రం ద్వారా రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో ఈమె ముగ్గురు పిల్లల తల్లిగా నటిస్తున్నారు. ఇంకా తెలుగు బుల్లితెరపై కొన్ని నృత్య సంగీత కార్యక్రమాలకు ఈమె న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తున్నారు.
 
 అతిలోక సుందరి
 సీనియర్ నటి శ్రీదేవి విషయానికొస్తే ఇద్దరు పిల్లల తల్లి. ఆమె పెద్ద కుమార్తెను హీరోయిన్‌గా పరిచయం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సుదీర్ఘ విరామం తరువాత ఆమె ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో రీ ఎంట్రీ అయ్యారు. ఆ చిత్రానికి ఆమె ప్రధానం అయినా ఆంటీ పాత్రనే పోషించి మెప్పించారు. ఆ తరువాత చిన్న గ్యాప్ తీసుకుని, తాజాగా తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న గరుడ చిత్రంలో ముఖ్యపాత్ర చేస్తున్నారు. అదే విధంగా తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా పలు చిత్రాలు చేసిన నటి నదియ ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి చిత్రం ద్వారా ఆ చిత్ర హీరో జయం రవికి తల్లిగా నటించారు. ఆ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టడంతో ఆ తరువాత వరుసగా అమ్మగా, అత్తగా, అక్కగా పలు చిత్రాల్లో నటి స్తున్నారు.
 
 బుల్లి తెరపై మెరుపులు
 అమలా నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళంతోపాటు తెలుగులోను క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్. నాగార్జునను వివాహమాడిన తరువాత నటనకు దూరంగా ఉన్నారు. ఈమె కొడుకు అఖిల్ ఒక పక్క హీరోగా పరిచయం అవుతుంటే అమల మళ్లీ నటిగా పునఃప్రవేశం చేయడం విశేషం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ముగ్గురు పిల్లలకు తల్లిగా నటించిన ఈమె తాజాగా తమిళంలో ఒక మెగా సీరియల్‌లో నటిస్తున్నారు. అదే విధంగా అజిత్ సరసన కాదల్‌మన్నన్ చిత్రంలో నటించిన మాను కొంతకాలం చిత్రాలకు దూరంగా సింగపూరులో నివసించారు. మళ్లీ ఇటీవల ఎన్న సత్తం ఇంద నేరం చిత్రం ద్వారా రీ ఎంట్రీ అయ్యారు.  మాళవిక, లైలా, ప్రియారామన్ తదితరులు బుల్లితెరపై ప్రత్యక్షమవుతున్నారు. వీరంతా సినిమానే లోకంగా జీవిస్తున్న తారలు. వీరి పునః ప్రవేశానికి సంపాదన ఒక్కటే కారణం కాదు. దానిని మించి నటనపై మమకారం అని చెప్పవచ్చు.
 
 ఏడేళ్ల తరువాత...
 కోలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్‌గా వెలిగిన జ్యోతిక నటుడు సూర్యతో కలిసి ఏడు చిత్రాలు చేసి ఏడేళ్లు ఆయనతో ప్రేమబంధాన్ని పెంచుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఏడేళ్ల విరామం తరువాత జ్యోతిక నటిగా రీ ఎంట్రీ అయ్యారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన హౌ ఓల్డ్ ఆర్ యు చిత్ర తమిళ రీమేక్‌లో జ్యోతిక నటిస్తున్నారు. ఇది వివాహానంతరం స్త్రీలు ఎదుర్కొనే సమస్యల ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం. ఇంతకుముందు కథనాయికిగా విజయ విహారం చేసిన రమ్యకృష్ణ ప్రస్తుతం ఆంటీ పాత్రలతో అలరిస్తున్నారు. పక్కింటి అమ్మాయి ఇమేజ్ సంపాదించుకున్న దేవయాని ఆ తరువాత బుల్లితెరపై ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం నగరంలోనే ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఈమె తాజాగా సహాబ్దం చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇంతకుముందు కమలహాసన్ సరసన విరుమాండి చిత్రంతోపాటు ప్రభు తదితర ప్రముఖ హీరోలతో డ్యూయెట్లు పాడిన అభిరామి హౌ ఓల్డ్ ఆర్ యు చిత్రం ద్వారా మళ్లీ నటనపై దృష్టి సారిస్తున్నారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు