మెడాల్ దెబ్బకు విలవిల

1 Oct, 2016 02:18 IST|Sakshi
మెడాల్ దెబ్బకు విలవిల

- తప్పుడు నివేదికలతో రోగుల్లో కలవరం
- తాజాగా అనంతపురంలో ఓ చిన్నారి మృతి
- రక్తం గడ్డకట్టాక ల్యాబొరేటరీలకు నమూనాలు
- డెంగీ కేసులు 53వేలు... కాదు 900 మాత్రమే...
- సీఎం డాష్‌బోర్డు సంఖ్యల మార్పు
- మెడాల్ అవినీతికి అండగా రాజకీయ నేతలు
- ముడుపులు మెక్కి కిమ్మనని అధికారులు

 
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలోని ప్రభుత్వాసుపత్రుల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న మెడాల్ సంస్థ దెబ్బకు రోగులు విలవిల లాడుతున్నారు. రక్తపరీక్షల్లో తప్పుడు నివేదికలు రోగుల ప్రాణం మీదకొస్తున్నాయి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు రిపోర్టుల్లో రావడంతో పూర్తిగా వైద్యమే మారి చిన్నారుల ప్రాణం మీదకు వచ్చిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సుమారు రూ.120 కోట్ల ప్రాజెక్టు దక్కించుకున్న మెడాల్ సంస్థ ఇష్టారాజ్యంగా రక్తపరీక్షలు నిర్వహిస్తున్నా, తప్పుడు రిపోర్టులు ఇస్తున్నా అడిగే నాథుడే లేరు.

ఆఖరుకు సీఎం డాష్ బోర్డులోని సమాచారం మార్చేసినా పట్టించుకునే వారు లేరు. రాష్ట్రంలో 2016 ఆగస్ట్ 14 నాటికి 52 వేల పైచిలుకు డెంగీ కేసులు నమోదైనట్టు జిల్లాల వారీగా వివరాలతో సీఎం కోర్ డాష్ బోర్డులో నమోదు చేసింది. అధికారులు మాత్రం కేవలం 600 పై చిలుకు మాత్రమే జరిగినట్టు ముఖ్యమంత్రికి నివేదించారు. దీనిపై ‘మెడాల్‌కు మేత’ పేరుతో సాక్షిలో పతాక శీర్షికతో వచ్చింది.
 
  దీంతో వెంటనే సీఎం కోర్ డాష్ బోర్డు నుంచి డెంగీ వివరాలను తొలగించారు. ఆ తర్వాత మళ్లీ ప్లేటు మార్చి ఇప్పటివరకూ డెంగీ కేసులు రాష్ట్రంలో 900 మాత్రమే నమోదైనట్టు 2016 సెప్టెంబర్ 27న కోర్ డాష్‌బోర్డులో పెట్టారు. దీన్ని బట్టి మెడాల్ సంస్థ, సర్కారు రెండూ కలిపి చేస్తున్న మాయ పేద రోగుల ప్రాణం మీదకు వచ్చింది. డెంగీ కేసుల విషయంలో మెడాల్ తప్పుడు రిపోర్టులు ఇచ్చిందని గుర్తించిన సర్కారు డెంగీ పరీక్షలు మెడాల్‌కు ఇవ్వకూడదని నిర్ణయించింది. పోనీ దీనికోసం ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేసిందా అంటే అదీ లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రోగులు ప్రైవేటు ల్యాబొరేటరీల్లో వేలకు వేలు చెల్లించి డెంగీ నిర్ధారణ చేయించుకుంటోన్న పరిస్థితి కనిపిస్తోంది.
 
 రక్తం గడ్డకట్టాక ల్యాబొరేటరీకి నమూనాలు
 రోగుల నుంచి రక్తం సేకరించాక రెండు గంటల్లోగా లేబరేటరీకి పంపించి రక్తపరీక్షలు నిర్వహించాలి... లేదంటే రక్తం గడ్డకట్టిపోతుంది. అదికూడా తగినంత శీతలీకరణ బాక్స్‌లో పెట్టి తీసుకెళ్లాలి. కానీ ఉదయం తొమ్మిది గంటల నుంచి తీసిన రక్త నమూనాలు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా లేబరేటరీకి చేరడం లేదని, అప్పటికి రక్తం గడ్డ కట్టి పోతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గడ్డ కట్టిన రక్తాన్ని పరీక్షిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో అంచనా వేసుకోవచ్చు.
 
 రాజకీయ అండతోనే మెడాల్ మాయ
 చెన్నైకి చెందిన మెడాల్‌సంస్థ రాష్ట్రంలో తొలిసారి పెలైట్ ప్రాజెక్టు కింద అనంతపురం జిల్లాను దక్కించుకున్నారు. ఆ తర్వాత అన్ని జిల్లాలు వీళ్లకే వచ్చాయి. టెండర్ల నుంచీ ఎంఓయూ వరకూ అన్నీ రాజకీయ ఒత్తిళ్లతోనే నడిచాయి. దీనివెనక కొంతమంది మంత్రులతోపాటు ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ కూడా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అంతేకాదు మెడాల్ రాష్ట్రవ్యాప్తంగా రక్తపరీక్షల నిర్వహణ కోసం ఫ్రాంచైజీలను ఇచ్చింది. వీటిని ఎక్కువగా తెలుగుదేశం ఎమ్మెల్యేల అనుయాయులు దక్కించుకున్నారు. దీంతో మెడాల్ సంస్థను ప్రశ్నించే దిక్కు కూడా లేకుండా పోయింది. రాజకీయ నేతల ఒత్తిళ్ల కారణంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కూడా నోరెత్తలేని పరిస్థితి. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు మెడాల్ నుంచి భారీమొత్తాన్ని పుచ్చుకుని ఆ సంస్థ ఎన్ని తప్పులు చేస్తున్నా నోరుమెదపడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇంత ఘోరంగా తప్పుడు రిపోర్టులు వస్తున్నా, చేయనివి చేసినట్టు చూపిస్తున్నా కనీసం వారికి ఇచ్చే బిల్లుల్లో కూడా కోత విధించని దుస్థితి నెలకొంది.
 
 ఒక్కనెలలో 8.72 లక్షల మందికి ప్లేట్‌లెట్ పరీక్షలు
 రాష్ట్రంలో డెంగీ కేసులు 1400 మందికి మాత్రమే వచ్చాయి, మలేరియా 25 వేలకు మించలేదని, టైఫాయిడ్ జ్వరాలు 400 మందికి లోపే ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ 2016 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 28వ తేదీవరకూ మెడాల్ సంస్థ 8.72 లక్షల మందికి ప్లేట్‌లెట్ కౌంట్ పరీక్షలు నిర్వహించింది. ఇది స్వయానా సీఎం కోర్‌డాష్ బోర్డులో పెట్టిన సమాచారం. సాధారణంగా జ్వర బాధితులకే ప్లేట్‌లెట్ కౌంట్ నిర్వహిస్తారు. అంటే 28 రోజుల్లోనే 8.72 లక్షల మందికి జ్వరాలుంటే గత ఆరు మాసాలుగా ఎంతమందికి జ్వరాలొచ్చాయో ఊహించుకోవచ్చు. ఇందులో  ప్లేట్‌లెట్ కౌంట్ టెస్టు ఒకటే అయినా, ఐదారు రకాలు టెస్టులు చేసినా ప్రభుత్వం రూ.235 చెల్లించాల్సిందే. దీన్నిబట్టి ఒక్క సెప్టెంబర్ నెలలోనే మెడాల్‌కు ప్రభుత్వం రూ.20.49 కోట్లు చెల్లించింది.
 
 మెడాల్ తప్పుడు నివేదికలకు సాక్ష్యాలు...
 -    అనంతపురంలో తాజాగా సోఫియా అనే బాలికకు డెంగీ జ్వర లక్షణాలు లేవని ఇచ్చారు. ఆ తర్వాత ఆ బాలిక డెంగీ జ్వరంతోనే మృతి చెందింది.
 -    చిత్తూరు జిల్లాకు చెందిన వడివేలు అనే రోగి కామెర్ల లక్షణాలతో ఆస్పత్రికెళితే (రిపోర్టు నెం.ఎస్‌ఐడీ నెం.642057865) అతనికి కామెర్లు లేవని (బిల్లిరూబిన్ 0.8 ఉండటంతో) రిపోర్టు ఇచ్చారు. వైద్యులు అనుమానంతో అతనికి బయట రక్తపరీక్షలు చేయిస్తే తీవ్ర కామెర్లు (2.9)ఉన్నట్టు తేలింది.
 - ప్రకాశం జిల్లాలో శ్రీవర్ష అనే 13 ఏళ్ల బాలిక ప్రభుత్వాస్పత్రికి వెళితే డెంగీ ఉందని చెప్పారు (రిపోర్ట్ నెం.ఎస్‌ఐడీ 641679467). తల్లిదండ్రులు ప్రైవేటు ల్యాబొరేటరీలో చేయిస్తే టైఫాయిడ్ అని తేలింది... ఇలాంటి కేసులు కోకొల్లలు.

మరిన్ని వార్తలు