పదవి నాకొద్దు

13 Mar, 2015 02:00 IST|Sakshi

రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎం.బీ పాటిల్

బెంగళూరు:  కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష స్థానం రేసులో తాను లేనని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎం.బీ పాటిల్ స్పష్టం చేశారు. బెంగళూరులో మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. తనకు కేపీసీసీ అధ్యక్ష స్థానంపై ఎలాంటి  ఆశ లేదన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ ప్రస్తుత అధ్యక్షుడు పరమేశ్వర్‌కు సైతం తెలియజేశానని తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం తాను నిర్విస్తున్న భారీ నీటిపారుదల శాఖ మంత్రిత్వ శాఖను వీడి ఇతర శాఖకు వెళ్లాలనే ఆలోచన తనకు లేదన్నారు. ప్రస్తుతం తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖతో సంతృప్తిగానే ఉన్నానని తెలిపారు.

కర్ణాటక భూ భాగానికి చెందిన మేకదాటు వద్ద జలాశయాన్ని నిర్మించడానికి తమిళనాడు ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయమై న్యాయనిపుణులతో ఇప్పటికే చర్చించామని తెలిపారు. రానున్న పదినెలల్లోపు ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక తయారవుతుందని ఎం.బీ పాటిల్ తెలిపారు. మేకెదాటు వద్ద జలాశయాన్ని నిర్మించడం వల్ల తమిళనాడుకు కర్ణాటక నుంచి ఇవ్వాల్సిన కావేరీ జలాల్లో ఎటువంటి కోత పడదని స్పష్టం చేశారు. అయినా అక్కడి ప్రభుత్వం ఈ విషయమై అనవసర రాద్ధాంతం చేస్తోందని ఎం.బీ పాటిల్ ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు.
 
 
 

మరిన్ని వార్తలు