వెనకడుగేస్తే కాంగ్రెస్‌కే దెబ్బ

1 Jan, 2014 22:58 IST|Sakshi

ముంబై : అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ‘ఆప్’ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ ప్రజలు క్షమించరని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తమ పార్టీ లోక్‌సభ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. తాము కాంగ్రెస్ మద్దతు తీసుకోలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో వారే తమకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారన్నారు. మద్దతుకు వారి విధించే ఎటువంటి షరతులకూ తాము ఒప్పుకునేదిలేదని ముందే చెప్పామన్నారు.

 ఆప్ సర్కారుకు కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంటే.. పరిస్థితి ఏంటని విలేకరులు అడిగిన ప్రశ్నకు అయన సమాధానమిస్తూ.. ఒకవేళ కాంగ్రెస్ అలాంటి నిర్ణయం తీసుకుంటే ఢిల్లీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఏమాత్రం క్షమించబోరని ఆయన తేల్చి చెప్పారు. తాము అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. జనలోక్‌పాల్, అవినీతిరహిత భారతదేశం లక్ష్యంగా తాము రాజకీయాల్లోకి వచ్చామని చెప్పారు. అయితే జాతీయ పార్టీలు తమను తక్కువ అంచనా వేశాయని, ఢిల్లీ ఎన్నికల్లో తమ ప్రభావం ఉండబోదనే ఆలోచనతో ముందుకు వెళ్లి బోర్లాపడ్డాయని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు.‘ మనం వారిని ఐదేళ్లపాటు పాలించండని ఓటేసి గెలిపించాం.

అయితే వారు సామాన్య ప్రజలకు ఎటువంటి ఉపయోగంలేని చట్టాలను తీసుకువచ్చి, బడా పారిశ్రామికవేత్తల కొమ్ముకాశారు..’ అని ఆయన గత పార్టీల పనితీరును దుయ్యబట్టారు. ప్రస్తుతం దేశంలో ఉన్న అధికార , న్యాయవ్యవస్థల పని విధానం సామాన్య ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడేలా లేవని ఆయన విశ్లేషించారు. పోలీస్, ఉద్యోగస్వామ్యం, న్యాయవ్యవస్థల్లో మార్పులు తేవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ పార్టీల అహాన్ని దెబ్బతీశాయని ఆయన వివరించారు. బీజేపీ బహిరంగ మతతత్వ పార్టీ అయితే, కాంగ్రెస్ ప్రఛన్న మతతత్వ పార్టీ అని ప్రశాంత్ భూషణ్ విమర్శించారు.

 ఢిల్లీ ఎన్నికలు సామాన్య మానవుడిలో ఉన్న భ్రమలను తొలగించాయని ఆయన చెప్పారు. ఆప్‌ను రాజకీయ పార్టీగా కాకుండా వ్యవస్థ మార్పు నకు ఒక సూచికగా పేర్కొనవచ్చన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ దేశం మొత్తం పోటీచేయనున్నట్లు ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. ఎక్కడెక్కడ పార్టీకి మంచి అభ్యర్థులు దొరుకుతారో, ఎక్కడ తమకు పట్టు ఉంటుందో ఆయా స్థానాల్లో పోటీకి సిద్ధపడుతున్నామన్నారు. ప్రస్తుతం పార్టీకి దేశవ్యాప్తంగా 310 జిల్లాల్లో శాఖలున్నాయని చెప్పారు. తమ పార్టీ పాలనా తీరుకు, గత పార్టీల పాలనా విధానం మధ్య వ్యత్యాసాన్ని ఢిల్లీ ప్రజలు ఇప్పటికే గమనించారని ఆయన చెప్పారు.

ప్రభుత్వం ఎప్పుడూ పారదర్శకంగా, ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది తమ పార్టీ సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకునేదీ లేనిదీ ఇప్పటివరకు నిర్ణయించుకోలేదన్నారు. అయితే చాలావరకు లోకల్ పార్టీలు సైతం అవినీతిమయమై ఉన్నాయన్నారు. తమ పార్టీ  కేజ్రీవాల్ నాయకత్వంలోనే లోక్‌సభ ఎన్నికలకు వెళుతుందని, అయితే తాము ఏ ఒక్కరి చరిష్మానో నమ్ముకుని పనిచేయడంలేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ మధ్య పోలికే లేదన్నారు. మోడీ కేపటలిస్టులకే ఎక్కువ సన్నిహితుడని ఆయన విశ్లేషించారు.

 ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం మూడు ప్రైవేట్ విద్యుత్ కంపెనీలపై కాగ్ ఆడిటింగ్‌కు ఆదేశించిందన్నారు. గత ప్రభుత్వాలు ఆ కంపెనీలపై కనీస చర్యలకు కూడా సాహసించలేదని ఆయన గుర్తుచేశారు. రుణాలు తీసుకుని ఎగవేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఆప్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాగా, మహారాష్ట్రలో తమ పార్టీ మనుగడకు అన్నాహజారే, మేధా పాట్కర్ వంటి ప్రముఖ సామాజిక కార్యకర్తల మద్దతు తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆప్ నాయకుడు మయాంక్ గాంధీ తెలిపారు. ‘మేం అన్నా హజారేను గౌరవిస్తాం.. ఎందుకంటే ఆయన మార్గదర్శక సూత్రాలపైనే మా పార్టీ ఏర్పాటైంది..’ అని మయాంక్ వివరించారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా