జన సందోహం

12 Dec, 2016 14:33 IST|Sakshi

► అమ్మ సమాధి వద్దకు అభిమాన సందోహం
►వాటర్ బాటిళ్లు, అల్పాహారం పంపిణీ
►నిఘా కట్టుదిట్టం        
►కమిషనర్ జార్జ్ పర్యవేక్షణ
►కాంస్య విగ్రహం ఏర్పాటుకు కసరత్తులు

 
అమ్మ జయలలిత సమాధిని దర్శించుకునేందుకు అభిమాన, ప్రజా సందోహం తండోపతండాలుగా మెరీనాతీరానికి తరలి వస్తున్నారు. అభిమానుల తాకిడి మూడో రోజుగా  గురువారం మరింత పెరగడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. బారికేడ్ల ద్వారా క్యూలైన్ ఏర్పాటు చేసి, తోపులాటకు అవకాశం ఇవ్వకుండా తగు చర్యల్ని అన్నాడీఎంకే వర్గాలు, అధికార వర్గాలు చేపట్టారుు. ఇక, అభిమాన,  జన సందోహానికి వాటర్ బాటిళ్లు, ప్యాకెట్లు, అల్పాహారం అందించే పనిలో జయ పేరవై వర్గాలు నిమగ్నమయ్యారుు. - సాక్షి, చెన్నై
 
 సాక్షి, చెన్నై:
మహానాయకురాలు అమ్మ జయలలిత భౌతికంగా అందర్నీ వీడి గురువారంతో నాలుగు రోజులైంది. ఆమెను తలుచుకుంటూ లక్షలాది హృదయాలు అమ్మ..అమ్మ అని రోదిస్తున్నారు. మరెన్నో లక్షలాది హృదయాలు మళ్లీ రావమ్మా ...అంటూ తమ తంగ తాయ్(బంగారు తల్లి)ని తలచుకుంటూ కన్నీటి పర్యంతంలో మునిగారు. పదుల సంఖ్యలో మరెన్నో హృదయాలు బరువెక్కి, చివరకు అమ్మా నీ వెంటే అన్నట్టు మృత్యు ఒడిలోకి చేరుతున్నారుు. బుధవారం నాటికి 77 మంది అమ్మ కోసం గుండె పగిలి మరణించగా, గురువారం మరో తొమ్మిది గుండెలు ఆగారుు. ఇక, అమ్మ భౌతిక కాయాన్ని దగ్గరుండి దర్శించుకోలేని పరిస్థితి నెలకొనడంతో, ప్రస్తుతం ఆమె సమాధికి చేరువలో చేరి అభిమాన లోకం తమ ఆవేదనను, తమ గుండెల్లోని బాధను దిగ మింగుకోలేక బోరుమని విలపిస్తున్నారుు. మెరీనా తీరంలో రాజకీయ గురువు దివంగత ఎంజీఆర్ సమాధికి కూత వేటు దూరంలో శాశ్వత నిద్రలో ఉన్న అమ్మ సమాధిని దర్శించుకునేందుకు  అభిమాన, జన సందోహం తండోప తండాలుగా పోటెత్తే పనిలో పడ్డారు.

మూడో రోజుగా వేలాది మంది తరలిరావడంతో వారిని కట్టడి చేయడానికి అన్నాడీఎంకే వర్గాలు, పోలీసులు ఆగమేఘాలపై ప్రత్యేక ఏర్పాటు చేయాల్సి వచ్చింది. చెన్నై, శివారుల నుంచే కాదు, రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కొందరు తమ సొంత వాహనాల్లో, మరి కొందరు రైళ్లల్లో, ఇంకొందరు బస్సుల్లో తరలి వచ్చి అమ్మ సమాధిని దర్శించుకొని కన్నీటి పర్యంతంతో నివాళులర్పిస్తున్నారు. కొందరు అరుుతే, చేతిలో అమ్మ చిత్ర పటాలను, మరి కొందరు అమ్మ ఫ్లెక్సీలు, బ్యానర్లతో ఊరేగింపుగా సమాధి వద్దకు పోటెత్తుతున్నారు. కొందరు శిరోముండనం చేరుుంచుకుంటున్నారు. మరి కొందరు చేతిలో కర్పూరం వెలిగించి పురట్చి తలైవీ సమాధి వైపుగా హారతి పడుతున్నారు. వృద్ధులు, పిల్లలు సైతం అమ్మా మళ్లీ  ఓ సారి రావా..? అమ్మా నీ లోటు మాకు తీర్చేదెవ్వరో..?అని విలపిస్తున్నారు.


నిఘా కట్టుదిట్టం:
నిత్యం జన, అభిమాన సందోహం మెరీనా వైపుగా పోటెత్తుతుండడంతో అన్నాడీఎంకే వర్గాలు, పోలీసు యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. మంత్రి ఆర్‌బీ.ఉదయకుమార్, ఎమ్మెల్యే అలెగ్జాండర్ నేతృత్వంలో అన్నాడీఎంకే కార్యకర్తలు స్వచ్ఛందంగా అమ్మ సమాధి వద్దకు వస్తున్న జన సందోహం కోసం వాటార్ బాటిళ్లు, ప్యాకెట్లు, కిచిడి, పొంగల్, సాంబారు అన్నం వంటి వాటిని ఉచితంగా పంపిణీ చేయడం విశేషం. ఇక, జనం ఒకేసారిగా సమాధి వైపు దూసుకు రాకుండా, పకడ్బందీ చర్యలు చేపట్టారు. బారికేడ్లను ఏర్పాటు చేసి, క్యూలైన్ ద్వారా లోనికి అనుమతించే పనిలో పడ్డారు. సమాధి వద్ద రెండు వందల మంది భద్రతా సిబ్బంది నియమించారు. ఆ పరిసరాల్లో ట్రాఫిక్ కష్టాలు, జనం తోపులాటకు ఆస్కారం ఇవ్వకుండా మరింతగా సిబ్బందిని నియమించారు. రోడ్డుపైన వాహనాలు ఆగకుండా, నిలపకుండా, తగు చర్యలు తీసుకున్నారు. అన్ని వాహనాలు మెరీనా బీచ్‌లోని పార్కింగ్ వైపుగా మళ్లించేందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. నగర పోలీసు కమిషనర్ జార్జ్ అక్కడికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.


కాంస్య విగ్రహం:
సీఎం జయలలిత సమాధి వద్ద ఆగమేఘాలపై ఏర్పాట్లు సాగుతున్నారుు. సమాధి చుట్టూ సుందరంగా తీర్చిదిద్దే పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు . అమ్మ సమాధిని దర్శించేందుకు వస్తున్న జనం ఓ వైపు రాక, మరో వైపు బయటకు వెళ్లేందుకు తగ్గట్టు చర్యలు తీసుకున్నారు. జనం ఎవ్వరూ ఆ పరిసరాల్లోనే తిష్ట వేయడానికి వీలు లేని విధంగా ముందుకు సాగేందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. ఎంజీఆర్ సమాధి సందర్శన, అక్కడి నుంచి అమ్మ సమాధి వైపుగా క్యూలను ఏర్పాటు చేశారు.ఇక, సమాధి వద్ద అమ్మ కాంస్య విగ్రహాన్ని ఒకటి రెండురోజుల్లో ఏర్పాటు చేయనున్నారు. అలాగే, నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని పార్టీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేయడానికి తగ్గ కసరత్తుల్ని అన్నాడీఎంకే వర్గాలు వేగవంతం చేశారుు.  

మరిన్ని వార్తలు