మీరే నా దేవుళ్లు! 

1 Jul, 2020 07:50 IST|Sakshi

తల్లిదండ్రులకు ఆలయం కట్టిన కుమారుడు

అన్నానగర్‌ : తంజావూరు జిల్లా పేరావూరని సమీపంలో తల్లిదండ్రులకు ఓ కుమారుడు ఏకంగా ఆలయాన్నే కట్టేశాడు. తంజావూరు జిల్లా పేరావూరని సమీపం కూప్పుక్కాడు గ్రామానికి చెందిన నటేషన్, రాజామణి దంపతులు. వీరిద్దరూ కొన్ని సంవత్సరాలకు ముందు మృతి చెందారు. వీరికి పెరమైయాన్, రాజాకన్ను, మారిముత్తు, సౌందరరాజన్, కరుప్పయ్యన్‌ అనే ఐదుగురు కుమారులు ఉన్నారు. వీరిలో ఐదో కుమారుడైన కరుప్పయ్యన తన తల్లిదండ్రుల మీద అధిక ప్రేమ కలిగినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులు చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన తల్లిదండ్రులకు ఆలయం కట్టి రోజూ పూజ చేయాలని సిద్ధమయ్యాడు. నాలుగేళ్లకు ముందు ఆలయం కట్టి కుంభాభిషేకం చేశాడు.

అందులో తన తల్లిదండ్రుల ఫొటోలను పెట్టి ప్రతిరోజూ పూజ చేస్తూ వస్తున్నాడు. ప్రతి సంవత్సరం జూన్‌ 29న కుంభాభిషేకం చేయగా ఆ రోజున అన్నదానం కూడా చేస్తున్నాడు. ఈ ఏడాది కరోనా కల్లోలం కారణంగా జనం గుంపులుగా ఉండకూడదన్న నిబంధనతో ప్రజలు రాలేదు. తల్లిదండ్రుల ఆలయంలో పూజచేసి పొంగల్‌ పెట్టి స్థానికులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. నటేశన్, రాజామణి దంపతులకు కుమారులు, మనవళ్లు, మనవరాళ్లు అని కుటుంబ సభ్యులు 85 మంది ఉన్నారు. ఈ పూజలో అందరూ కలుసుకుంటారు. తల్లిదండ్రులు ప్రాణాలతో ఉండేటప్పు డే గమనించకుండా అనాథశ్రమాలలో చేర్పించే కుమారులు ఉన్న ఈ కాలంలో తల్లిదండ్రులకు ఆలయం కట్టి పూజ చేస్తూ వస్తున్న కరుప్పయ్యన్‌ చూసి ఆ ప్రాంత ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.   

మరిన్ని వార్తలు