జయకు జెడ్ ఫ్లస్ భద్రతపై పిటిషన్

10 Dec, 2013 02:21 IST|Sakshi
సాక్షి, చెన్నై:రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలితకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను కల్పించాలని కోరుతూ సోమవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు అగ్ని హోత్రి, శశిధరన్ నేతృత్వంలోని బెంచ్ విచారణకు స్వీకరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలితకు జెడ్ కేటగిరి భద్రతను కల్పించారు. జాతీయ స్థాయి నేతగా ఉన్న జయలలితకు భద్రతను మరింత పెంచాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే, అందుకు తగ్గ చర్యల్ని కేంద్రం తీసుకోలేదు. దీంతో చెన్నైకు చెందిన న్యాయవాది బాలాజీ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో జయలలిత జాతీయ స్థాయి నేత అని గుర్తు చేశారు. 
 
 పధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించారని వివరించారు. అయితే, జయలలితకు ఆ భద్రతను కేటాయించడంలో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని పేర్కొన్నారు. జయలలితకు తీవ్ర వాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నదని వివరించారు. బీజేపీ జాతీయ నేత అద్వానీ హత్యకు కుట్ర చేసిన తీవ్రవాదుల్ని జయలలిత ప్రభుత్వం కటకటాల్లోకి పంపిం చినట్లు పేర్కొన్నారు. తీవ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్న జయలలితకు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు సమాచారం అందిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తాను ఈ విషయమై కేంద్రానికి, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఇంత వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతోనే కోర్టును ఆశ్రయించినట్టు వివరించారు.
 
 ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తులు సతీష్‌కుమార్ అగ్ని హోత్రి, కేకే శశిధరన్ నేతృత్వంలోని బెంచ్ విచారణకు స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ సోమయాజులు, కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసియేట్ జనరల్ విల్సన్ హాజరై తమ వాదన వినిపించారు. విచారణకు ముందుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాల్ని తీసుకోవాలని సూచించారు.   తోసి పుచ్చిన కోర్టు: న్యాయమూర్తి బాలాజీ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సాయంత్రం కూడా విచారణ జరిగింది. రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారుల్ని తక్షణం హాజరు కావాలని బెంచ్ ఆదేశించింది. దీంతో అధికారులు హాజరై జయలలితకు కల్పించిన భద్రత గురించి వివరించారు. ఆమెకు ఎస్‌పీజీ భద్రతకు కల్పించామని, ఎన్‌ఎస్‌జీ భద్రత వ్యవహారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని చెప్పారు. జెడ్ ప్లస్ భద్రతా వ్యవహారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న దష్ట్యా, ఈ పిటిషన్ విచారణను తోసి పుచ్చుతూ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.  
మరిన్ని వార్తలు