ఆన్‌లైన్‌లో ‘పిస్తాహౌస్ హలీమ్’

7 Jun, 2016 03:39 IST|Sakshi

* ‘స్విగ్గీ’ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేసేందుకు అవకాశం
* నగరంలోని ఏమూలకైనా డెలివరీ సదుపాయం
* ఈ ఏడాది మైసూరు, తుమకూరులో సైతం ఔట్‌లెట్‌ల ఏర్పాటు

సాక్షి, బెంగళూరు: ఉద్యాననగరి వాసుల మనసుదోచిన హైదరాబాదీ వంటకం ‘పిస్తాహౌస్ హలీమ్’ ఈ రంజాన్ మాసం సందర్భంగా మరోసారి బెంగళూరు నగరంలో అందుబాటులోకి వచ్చేసింది. కాగా, ఈ ఏడాది పిస్తాహౌస్ హలీమ్‌ను ‘స్విగ్గీ’ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కూడా బుక్ చేసుకునే సదుపాయాన్ని పిస్తాహౌస్ సంస్థ నగరంలో ఏర్పాటు చేసిన ఫ్రాంచైజీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

సోమవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫ్రాంచైజీ ప్రతినిధి షఫీక్ మాట్లాడుతూ... ఏడాదికేడాదికి బెంగళూరులో పిస్తాహౌస్ హలీమ్ అమ్మకాలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రముఖ ఫుడ్ ఆన్‌లైన్ పోర్టల్ ‘స్విగ్గీ’తో ఈ ఏడాది ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.తద్వారా రంజాన్ మాసమంతా బెంగళూరు నగరంలోని ఏ మూలకైనా సరే పిస్తాహౌస్ హలీమ్‌ను డెలివరీ చేయనున్నట్లు చెప్పారు. వినియోగదారులకు మరింత చేరవకావడంలో భాగంగానే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

ఇక ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఔట్‌లెట్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఔట్‌లెట్‌లలో పిస్తాహౌస్ హలీమ్‌తో పాటు హైదరాబాదీ బిర్యానీ, సమోసా, గాజర్ కా హల్వా, కుబానీ కా మీఠా సైతం ఆహార ప్రియుల కోసం అందుబాటులో ఉంటాయని అన్నారు.

ఇక ఈ ఏడాది  కేవలం బెంగళూరులోనే కాక మైసూరు, తుమకూరులో సైతం తమ ఔట్‌లెట్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో సైతం తమ ఔట్‌లెట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతపురం, కదిరి, ధర్మవరం, హిందూపురం ప్రాంతాల్లో తమ ఔట్‌లెట్‌లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. 330 గ్రాముల హలీమ్ ధర రూ.160, ఒకటిన్నర కిలోల హలీమ్ ధర రూ.650గా నిర్ణయించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు