తాటాకు బుట్టల్లో చికెన్‌!

5 Jan, 2017 19:36 IST|Sakshi
తాటాకు బుట్టల్లో విక్రయిస్తున్న కోడిమాంసం

కేకే నగర్‌: మార్కెట్‌ నుంచి చికెన్‌ ఎలా తెచ్చుకుంటారు? ఇదేం పిచ్చి ప్రశ్న.. సంచులతో అని తెలియదా అంటారా. పల్లెటూర్ల అయితే గిన్నెల్లో కూడా తెచ్చుకుంటారు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో తాటాకు బుట్టల్లో కోడిమాంసం తెచ్చుకుంటున్నారు. తిరునల్వేలి జిల్లా కార్పొరేషన్‌లో ప్లాస్టిక్‌ నిషేధం విధించడంతో వ్యాపారులు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు.

ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా తాటాకు బుట్టల్లో కోడిమాంసం విక్రయిస్తున్నారు. తిరునల్వేలి జిల్లాలో ఆరోగ్యశాఖ అధికారులు దుకాణాలకు వెళ్లి ప్లాస్టిక్‌ వస్తువులు, కవర్లను స్వాధీనం చేసుకుంటున్నారు. బుధవారం రోజున ప్రజల నుంచి ప్లాస్టిక్‌ వస్తువులను అధికారులు తీసుకునే పద్ధతిని కార్పొరేషన్‌ అధికారులు పరిచయం చేశారు. మిగతా రోజుల్లో జరిమానా వసూలు చేస్తున్నారు. మాంసం దుకాణాల్లో ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించే వారిపై జరిమానా విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాళయంకోట ఎస్పీ కార్యాలయం ఎదురుగా దుకాణాల్లో తాటాకు బుట్టల్లో మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఇందుకు తిరుచెందూర్‌ సమీపంలోని గ్రామాల నుంచి వందల సంఖ్యలో తాటాకు బుట్టలను వ్యాపారులు కొంటున్నారు.

దీనిపై మాంసం దుకాణం యజమాని రజాక్‌ మాట్లాడుతూ కార్పొరేషన్‌ చేపట్టిన ప్లాస్టిక్‌ నిషేధ చర్యలకు వ్యాపారులు సహకరిస్తున్నారని, ఇందులో భాగంగా తాటాకు బుట్టల్లో మాంసం విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్‌ కవర్లలో మాంసం గంట దాటితే చెడిపోయే అవకాశం ఉందని, అదే తాటాకు బుట్టలో ఆరు గంటల సేపు చెడిపోకుండా ఉంటుందని తెలిపారు. తాటాకు బుట్టల ద్వారా కుటీర పరిశ్రమ కార్మికులకు ఉపాధి లభిస్తుందని అన్నారు.
 

మరిన్ని వార్తలు