ప్లాట్‌ఫాం టికెట్ పది రూపాయలు

30 Mar, 2015 01:59 IST|Sakshi

సాక్షి, చెన్నై: రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచారు. రూ. ఐదుగా ఉన్న ఆ ధర ఇక, రూ. పదిగా నిర్ణయించారు. ప్లాట్ ఫాం టికెట్లు లేకుంటే రూ. వెయ్యి జరిమాన విధించేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి రానున్నది. అలాగే, 120 రోజులకు ముందుగా రిజర్వేషన్ చేసుకునే అవకాశం కూడా అమల్లోకి రానున్నది. రైల్వేస్టేషన్లలో ఫ్లాట్‌ఫాం టికెట్లు కొనుగోలు చేసే వాళ్లు అరుదే. ప్రధాన రైల్వేస్టేషన్లలో అయితే, ఎక్కడ టీసీలు పట్టుకుంటారో నన్న భయంతో కొనుగోలు చేసే వాళ్లు కొందరు  ఉంటారు. తమ వాళ్లను ఆహ్వానించేందుకు, వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో రైల్వేస్టేషన్లకు బంధు మిత్రులు రావడం సహజం. అయితే, వీరిలో ఎక్కువ శాతం మంది ప్లాట్ ఫాం టికెట్లను కొనుగోలు చేయడం లేదన్న వాదన ఉంది. *ఐదు పెట్టి ఫ్లాట్‌ఫాం టికెట్ కొనుగోలు చేయకుండా, దర్జాగా వచ్చి ఆహ్వానాలు, డ్కొలు పలికి వెళ్లే వాళ్ల భరతం పట్టేందుకు రైల్వే వర్గాలు సిద్ధం అయ్యాయి. కేంద్ర రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా *ఐదు ఉన్న ప్లాట్ ఫాం టికెట్టు ధర రూ. పదికి పెంచారు. ఇది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెచ్చేందుకు దక్షిణ రైల్వే అధికారులు సిద్ధం అయ్యారు.
 
 రూ. వెయ్యి జరిమాన : ఇక రూ. పది పెట్టి ఫ్లాట్ ఫాం టికెట్టు కొనుగోలు చేయకుంటే, రూ. వెయ్యి జరిమానా కట్టాల్సి వస్తుందన్న హెచ్చరికల్ని దక్షిణ రైల్వే వర్గాలు చేశాయి. రైల్వే స్టేషన్లలోని ఫ్లాట్ ఫాంల మీద రద్దీని క్రమబద్ధీకరించే విధంగా ప్లాట్ ఫాం టికెట్లకు సమయాన్ని సైతం తగ్గించారు. ఇది వరకు మూడు గంటలు సమయం కేటాయించగా, ఇక, ఒక సారి కొనుగోలు చేసిన ప్లాట్‌ఫాం టికెట్టు రెండు గంటల పాటుగా మాత్రమే ఉపయోగ పడుతుంది. ఒక వేళ రైళ్ల రాక పోకల్లో జాప్యం నెలకొన్న పక్షంలో, ఇచ్చిన సమయం ముగిసిన పక్షంలో మరో ప్లాట్‌ఫాం టికెట్టు కొనాల్సిందే. రాష్ర్టంలోని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఆగే ప్రతి రైల్వే స్టేషన్లలో ఇక ఫ్లాట్ ఫాం టికెట్‌ను కొనుగోలు చేయాల్సిందే.
 
  అలాగే, చెన్నై సెంట్రల్, ఎగ్మూర్‌లలో ప్లాట్ ఫాం టికెట్ల కన్నా, ఎలక్ట్రిక్ రైలు టికెట్లను చూపించి తప్పించుకునే వాళ్లే ఎక్కువ. ఇక, ఎలక్ట్రిక్ రైళ్ల టికెట్లు సెంట్రల్, ఎగ్మూర్ స్టేషన్ల ఫ్లాట్ ఫారాల్లో పనిచేయవని అధికారులు ప్రకటించారు. అలాగే, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల టికెట్లను పెట్టుకుని ఎలక్ట్రిక్ రైళ్లు ఎక్కేందుకు యత్నించినా జరిమానా తప్పదని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్లాట్ ఫాం టికెట్ కొత్త ధరల అమల్లోకి వస్తుందని, టికెట్ లేకుంటే ఇది వరకు *350 విధించే వాళ్లమని, ఇక రూ. వెయ్యి జరిమానా విధించ బోతున్నామని ఓ అధికారి పేర్కొన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి ప్లాట్ ఫాం టికెట్టు తప్పని సరి కానున్నడంతో, ఇక టీసీ,టీటీఆర్, స్టేషన్ల అధికారులకు చేతి నిండా పనే.
 
 ముందస్తు రిజర్వేషన్: ఇది వరకు 60 రోజులకు ముందుగా ముందస్తు రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉండేది. ఇక, 120 రోజులకు ముందుగా రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని రైల్వే యంత్రాంగం కల్పించి ఉన్నది. ఈ విధానం కూడా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నది. అలాగే, ఇది వరకు బెర్తుల రిజర్వేషన్లలో సీనియర్ సిటిజన్‌కు కింది భాగంలో రెండు సీట్లు కేటాయించే వాళ్లు. ఇక నాలుగు సీట్లను కేటాయించనున్నడం విశేషం.
 

మరిన్ని వార్తలు