మద్దతు ప్లీజ్..

8 Nov, 2016 04:06 IST|Sakshi

ప్రేమలత విజ్ఞప్తి
ఉప ప్రచారం ముమ్మరం
ఏర్పాట్లపై ఈసీ దృష్టి
రంగంలోకి పారా మిలటరీ

తమ అభ్యర్థుల పరిస్థితులకు అనుగుణంగా మద్దతు ఇవ్వాలని సీపీఎం, సీపీఐ, వీసీకేలకు డీఎండీకే విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు సోమవారం ఆ పార్టీ అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత  విన్నవించారు. ఇక, ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
 
సాక్షి, చెన్నై :
తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రం ఉప ఎన్నికల్లో డీఎండీకే అభ్యర్థులు అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులకు దీటుగా ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. గెలుపు ధీమాను సైతం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం వేడెక్కడంతో ఓట్ల వేటలో దూసుకెళుతున్నారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొంటున్న డీఎండీకే తమకు విజ్ఞప్తి చేస్తే, మద్దతు పరిశీలన చేస్తామని, సీపీఎం, సీపీఐ, వీసీకేలు ప్రకటించాయి. దీంతో తమకు పరిస్థితులకు అనుగుణంగా మద్దతు ఇవ్వాలని ప్రేమలత విజయకాంత్ ఆ పార్టీలకు విన్నవించారు.

మీడియాతో ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ధన ప్రవాహం ఎక్కువగానే ఉందని ఆరోపించారు. ప్రజా స్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగేది అనుమానమేనని పేర్కొంటూ, న్యాయం వైపుగా ఓటర్ల నిలబడాలని, అవినీతికి వ్యతిరేకంగా తమ మద్దతు పలకాలని కోరారు. తమకు మద్దతు ఇచ్చేందుకు పరిశీలిస్తామన్న ఆ మూడు పార్టీలు పరిస్థితులకు అనుగుణంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక, అరవకురిచ్చి అన్నాడీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీకి ఎక్కడకు వెళ్లినా, ముట్టడించి నిరసనలు తెలిపే వారి సంఖ్య పెరుగుతుండడంతో ఆ పార్టీ వర్గాలు వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాయి.

రంగంలోకి పారా మిలటరీ:
ప్రచార హోరు ఓ వైపు సాగుతుంటే, మరో వైపు ఎన్నికల ఏర్పాట్ల మీద ఈసీ దృష్టి కేంద్రీకరించింది. ఆయా నియోజకవర్గాల్లో నిఘా , తనిఖీల ముమ్మరం చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీ ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేకంగా ముఫ్‌పై బృందాలతో స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగే రీతిలో పన్నెండు కంపెనీలకు చెందిన పారా మిలటరీ బలగాల్ని భద్రతకు నియమించేందుకు నిర్ణయించారు. మీడియాతో లఖానీ మాట్లాడుతూ, వాహన తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు.

తంజావూరులో రూ.70 లక్షలు లెక్కలోకి రాని నగదు పట్టుబడిందన్నారు. తిరుప్పరగుండ్రంలో రూ. కోటి విలువగల నగలు, రూ. 75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాలకు తుది ఓటర్ల జాబితాను పంపించామని వివరించారు. ఎన్నికల నిర్వహణకు తగ్గ ఏర్పాట్లను ఆయా జిల్లా యంత్రాంగాల పర్యవేక్షణలో వేగవంతం చేశామన్నారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు