ఈ విజయదశమి చాలా ప్రత్యేకం..

10 Oct, 2016 03:01 IST|Sakshi
ఢిల్లీలో దీన్‌దయాళ్ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న ప్రధాని మోదీ

సర్జికల్ స్ట్రైక్స్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ మోదీ వ్యాఖ్య
ఢిల్లీలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి వేడుక

 న్యూఢిల్లీ: ఈ ఏడాది విజయదశమి చాలా ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భారత సైన్యం ఇటీవల వాస్తవాధీన రేఖ వెంబడి ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించి వివాదాలు ముసిరిన నేపథ్యంలో మోదీ వాటిని ఇలా పరోక్షంగా ప్రస్తావించారు. జనసంఘ్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీన్ దయాళ్ జీవితం, ఆయన బోధనలకు సంబంధించిన 15 పుస్తకాలను మోదీ విడుదల చేశారు.

అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. ‘‘ఈ ఏడాది మన దేశానికి విజయదశమి చాలా ప్రత్యేకమైనది’’ అని అన్నారు. దసరా పండుగ సందర్భంగా దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సైనిక శక్తి సమర్థవంతంగా ఉంటేనే.. దేశం బలంగా ఉంటుందని నమ్మిన వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని చెప్పారు. మనం బలంగా ఉండటం అంటే ఎదుటి వారికి వ్యతిరేకంగా ఉన్నట్టు కాదని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. మన సామర్థ్యం కోసం ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటే.. అది పొరుగు వారిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్నట్టుగా ఆందోళన చెందాల్సిన పని లేదని ఎద్దేవా చేశారు. మానవతా వాదం గురించి కృషి చేసిన గొప్ప వ్యక్తి ఉపాధ్యాయ అన్నారు.

>
మరిన్ని వార్తలు