వాయు నాణ్యత సూచికతో కాలుష్యానికి చెక్!

6 Apr, 2015 22:54 IST|Sakshi

దేశంలోని పది నగరాల్లోని వాయు నాణ్యత సూచిక ఏర్పాటు
సోమవారం లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని మోదీ
త్వరలో ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుచేసే యోచనలో కేంద్రం

 
సాక్షి, న్యూఢిల్లీ : వాయు నాణ్యత సూచికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యానికి పరిష్కారాలు ఏళ్ల కిందటి సంప్రదాయాలలోనే ఉన్నాయని చెప్పారు. కనీసం ఆదివారం రోజైనా సైకిళ్లను వాడాలని, పౌర్ణమి రోజు రాత్రి వీధి దీపాలు వాడకుండా ఉండాలని ఆయన సలహా ఇచ్చారు. కాగా, ప్రధాని ఆవిష్కరించిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (వాయు నాణ్యత సూచిక) ద్వారా ఢిల్లీ, హైదరాబాద్‌తో సహా దేశంలోని పది నగరాల్లో ప్రజలు పీల్చే గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు ప్రకటించే ఏర్పాటు చేశారు.

అలాగే దేశంలోని 66 నగరాల్లో దీనిని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులతో పాటు 10 లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాలన్నింటిలో దీనిని ఏర్పాటుచేస్తారు. ప్రపంచంలోని అత్యంత కలుషితమైన 20 నగరాల్లో 13 నగరాలు భారత్‌లోనే ఉన్నాయని, ప్రపంచంలోని రాజధాని నగరాలన్నింటిలో న్యూఢిల్లీ అత్యంత కలుషితమైన నగరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.

వాయు కాలుష్యం వల్ల ఆరోగ్యంపై ప్రభావం గురించి ప్రజలలో నెలకొన్న ఆందోళన దృష్ట్యా ప్రభుత్వం వాయు నాణ్యత సూచికను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం ఢిల్లీ, ఫరీదాబాద్, హైదరాబాద్, ముంబై, బెంగుళూరు, చెన్నై, ఆహ్మదాబాద్, ఆగ్రా, లక్నో, కాన్పూర్, వారణాసి నగరాల్లో ఉన్న వాయు నాణ్యతను ఈ సూచిక ప్రకటిస్తుంది. ఇందుకోసం ఈ నగరాల్లో వాయు నాణ్యతను చూపించే బోర్డులతో పాటు మానిటరింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.

కాలుష్య స్థాయిని సంఖ్యల్లోకి మార్చడం ద్వారా..

గాలిలో కాలుష్య స్థాయిని వాయు నాణ్యత సూచిక సంఖ్యల్లోకి మార్చి కాలుష్య తీవ్రత గురించి ప్రజలను హెచ్చరిస్తుంది. వాయు నాణ్యత ఏవిధంగా ఉండేది తెలుపుతుంది. దీని సహాయంతో ప్రజలకు కాలుష్యంపై అవగాహన కల్పించడమే కాకుండా, వాయు కాలుష్య స్థాయిని గూర్చి ప్రజలకు మీడియా ద్వారా హెచ్చరికలు అందించవచ్చు. ఢిల్లీలో వాయుకాలుష్య స్థాయి ఆందోళనకర స్థాయికి చేరిన దృష్ట్యా వాయు నాణ్యత సూచిక ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నారు.

ఢిల్లీ నగరం ప్రపంచంలోని 1,600 నగరాలన్నింటిలో కలుషిత నగరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. నగరంలోని గాలిలో పీఎం2.5 అనే సూక్ష్మ కణాల సంఖ్య బీజింగ్ గాలిలో ఉండేదాని కన్నా చాలా ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ సూక్ష్మ కణాలు  శ్వాసకోశంలోకి చొరబడి, రక్తప్రసరణ వ్యవస్థలోకి దూరి ఆరోగ్యనికి చేటు కలిగిస్తాయి. వీటి వల్ల క్రోనిక్ బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంది. ఇది తెలిసినప్పటి నుంచి నగరవాసుల్లో వాయు కాలుష్యంపై ఆందోళన అధికమైంది.

వాయు కాలుష్యానికి ఎక్కువగా గురివకాడం వల్ల ఢిల్లీలో ప్రతి ఏడాది 3 వేల మంది చిన్న వయసులోనే మరణిస్తున్నార ని బోస్టన్‌కు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్, ఢిల్లీకి చెందిన ఎనర్జీ రిసోర్సెస్ సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. ఇదిలా ఉండగా ప్యారిస్, బీజింగ్ నగరాల్లో వాయు కాలుష్య స్థాయి తీవ్రంగా ఉన్నట్లయితే కాలుష్య ఎమర్జెన్సీని ప్రకటించే పద్ధతిని పాటిస్తున్నారు. అంటే తీవ్ర కాలుష్య స్థాయి నుంచి మెరుగైన స్థాయిని వాయు నాణ్యత చేరుకునేంతవరకు అత్యవసర స్థితిని అమల్లో ఉంచి నగరంలోని పరిశ్రమలన్నింటినీ మూసివేస్తారు.

మరిన్ని వార్తలు