అడుగడుగునా అడ్డుకుంటున్నాం

31 Oct, 2013 00:36 IST|Sakshi

గడ్చిరోలి, న్యూస్‌లైన్: జిల్లాలో నక్సల్స్ ఆగడాలను అడుగడుగునా అడ్డుకుంటున్నామని పోలీస్ సూపరింటెండెంట్ సువేజ్ హక్ తెలిపారు. ఈ నెల 28న జిల్లాలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్ వివరాలను బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... ‘గడ్జిరోలి జిల్లాలో పంచాయతీ సమితి, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేగాకుండా పొరుగు రాష్ట్రమైన చత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోలనలు సృష్టించి, తమ ఉనికిని చాటుకునేందుకు ఇదే సరైన సమయమని నక్సల్స్ భావిస్తున్నారు.
 
 ఇటీవల పోలీస్ కమెండోలపై రెండుసార్లు కాల్పులకు తెగబడడం ఇటువంటి ప్రయత్నమే. అయితే పోలీసులు వారి ఆగడాలను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. వారి దుశ్చర్యలను ఎక్కడికక్కడ తిప్పికొడుతున్నాం. 28 వ తేదీని జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా నక్సలైట్లు మృతి చెందగా, ఒక పోలీసు జవాన్ మరణించాడు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో పెద్ద నాయకులు పాల్గొన్నారని భావిస్తున్నాం. సంఘటనాస్థలంలో తమకు పెద్ద మొత్తంలో మారణాయుధాలు లభ్యమయ్యాయి. వాటిలో 17 రౌండ్ల బుల్లెట్లు, 303 నంబర్ రైఫిల్, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్‌కు చెందిన ఏడు బులెట్లు, ఎనిమిది ఖాళీ కేస్ రౌండ్లు, రెండు గ్రనేడ్లు, బ్యాటరీ, చార్జర్, ఔషధాలు, పుస్తకాలు, వంట చేసుకొనే వస్తువులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం. ఈ నెల 27న గడ్చిరోలి జిల్లా గట్టా పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. 29న ఓట్ల లెక్కింపు జరిగింది. 28న నక్సలైట్లు ఎదురుకాల్పులకు దిగారు. అయితే అప్రమత్తంగా ఉన్న పోలీసులు వారి ఆటలను సాగనీయలేదు. ఇకపై కూడా జిల్లాలో వారి కార్యకలాపాలను సమర్థవంతంగా అడ్డుకుంటా’మని చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు