ఘరానా పోలీసులపై ఉక్కుపాదం

30 Apr, 2015 23:37 IST|Sakshi

- పోలీసుల నేరాలు పెరుగుతుండటంతో నగర సీపీ రాకేశ్ మారియా నిర్ణయం
- ట్రాక్ రికార్డు సరిగాలేని వారు బ్లాక్ లిస్టులోకి..
- ప్రజలతో సంబంధం లేని శాఖలకు బదిలీ
సాక్షి, ముంబై:
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే నేరాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా సీరియస్‌గా తీసుకున్నారు. గలీజు పోలీసులపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేశారు. తన ఆధీనంలో ఉన్న మొత్తం బలగాల చరిత్రను స్వయంగా పరిశీలించడం ప్రారంభించారు. అక్రమ సంబంధాలు, మద్యం బానిసలు, పని దొంగలుగా తేలిన పోలీసులను బ్లాక్ లిస్టులో పెట్టాలని నిర్ణయించారు. వీరందరినీ ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు లేని శాఖకు బదిలీ చేయనున్నారు.

వివరాల్లోకెళితే.. ఇటీవల మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న మహిళతో ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు సంబంధాలున్నట్లు వెలుగులోకి రావడం, సాకినాకా పోలీసుస్టేషన్‌లో మోడల్‌పై పోలీసులు సామూహిక అత్యాచారానికి పాల్పడడం, వడాలాలో అత్యాచారం కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం  తదితర సంఘటనలతో పోలీసు శాఖపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో మలినమైన పోలీసు శాఖను శుభ్రం చేసేందుకు మారియా వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ‘కొందరు పోలీసుల నిర్వాకం వల్ల మొత్తం శాఖపై మచ్చ పడుతోంది. ఇలాంటి వారిని ఏరేసి మే నెలాఖరుకు జాబితా రూపొందిస్తామని మారియా అన్నారు. ట్రాక్ రికార్డ్ సరిగా లేని పోలీసులను సాయుధ, ప్రత్యేక దళాల శాఖలకు బదిలీ చేస్తామని మారియా తెలిపారు. ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వచ్చిన బాధితులతో ఎలా ప్రవర్తించాలి..? ఎలా మాట్లాడాలి..? వంటి వాటిపై శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని పోలీసు స్టేషన్లలో ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు. వృద్ధులు స్టేషన్‌కు వస్తే పరిధిలోకి రాదంటూ వేధించకుండా, ఫిర్యాదు నమోదు చేసుకుని వారి పంపించాలని సూచించినట్లు చెప్పారు. ట్రాఫిక్ శాఖలో పనిచేస్తున్న 25 మంది కానిస్టేబుళ్లను పనితనం సరిగా లేకనే బదిలీ చేశామని, ఎవరి ఫిర్యాదు మేరకు చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు