అర్ధరాత్రి పోలీసుల అత్యుత్సాహం

9 Oct, 2016 08:17 IST|Sakshi
  • భక్తులపై పోలీసుల ప్రతాపం
  • ఎదురు తిరిగిన భక్తులు
  • అడుగడుగునా అంక్షలు..
  •  
    విజయవాడ (వన్‌టౌన్/ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాల్లో భాగంగా పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అత్యుత్సాహం ప్రదర్శించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తే తమపై దౌర్జన్యం ఎమిటని భక్తులు ఎదురుతిరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ‘పోలీసులు డౌన్.. డౌన్..’ అంటూ భక్తులు నినాదాలు చేశారు. శనివారం సరస్వతీదేవి అలంకారంలో కొలువుదీరే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలోనే ఘాట్‌రోడ్డులోని క్యూలైన్లలోకి చేరారు.
     
    గతంలో దర్శనానంతరం భక్తులను మెట్ల మార్గం ద్వారా దిగువకు పంపేవారు. ఈసారి ఘాట్‌రోడ్డు నుంచే కిందకు పంపడంతో దర్శనం చేసుకుని వెళ్తున్న కొంతమంది కూడా మళ్లీ క్యూలైన్లలో చేరారు. రాత్రి 11.45 గంటలకు ఘాట్‌రోడ్డులోని క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. సుమారు ఎనిమిది వేల మంది భక్తులు ఉన్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు క్యూలైన్లలో ఉన్న భక్తులను ఖాళీ చేయించడం ప్రారంభించారు. భక్తులు అభ్యంతరం తెలపడంతో పోలీసులు తమ స్టేషన్‌లో మాదిరిగా మాట్లాడారు.
     
    మనస్తాపానికి గురైన పలువురు భక్తులు తాము దొంగలం కాదని అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఆయన వెంటనే వ్యాన్లు తీసుకొచ్చి అందరినీ ఎక్కించండి.. అని సిబ్బందిని ఆదేశించారు. తన వద్ద ఉన్న ఫోన్‌లో భక్తులను వీడియో తీశారు. ఈ క్రమంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏసీపీ అక్కడకు చేరుకుని భక్తులను బలవంతంగా బయటకు పంపాలని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు మరింత రెచ్చిపోయారు.
     
    ఘాట్‌రోడ్డులోని సగం క్యూలైన్లు ఖాళీ చేసిన తర్వాత టోల్‌గేట్ వద్ద భక్తుల రద్దీ పెరిగిపోయింది. దీంతో ఘాట్‌రోడ్డులో ఉన్న వారిని క్యూలైన్లలోకి పంపించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు పోలీసులు వారిని క్యూలైన్లలోకి పంపారు. అంతరాలయం వద్దకు కూడా భార్యాభర్తలపై ఓ సీఐ దుర్భాషలాడారు.
     
    సిబ్బందికి సైతం చుక్కలు చూపించారు
    భక్తులకే కాకుండా ఆలయ సిబ్బందికి సైతం పోలీసులు చుక్కలు చూపించారు. అర్ధరాత్రి ఎక్కువగా ఉన్న రద్దీ ఉదయం 6 గంటల కల్లా రద్దీ సాధారణంగా మారింది. మరో వైపున వర్షం కురియడంతో భక్తుల రద్దీ మరింత తగ్గినప్పటికీ పోలీసులు బందోబస్తును సడలించలేదు. కుమ్మరిపాలెం, ఇటు వినాయకుడి గుడి, అశోక స్తూపం వద్ద రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి ఎవరినీ అనుమతించలేదు.
     
    ఉదయం 7గంటలకు కొండపై విధులకు వస్తున్న ఆలయ ఉద్యోగులను కూడా పంపకపోవడం విమర్శలకు దారి తీసింది. డ్యూటీ పాస్‌లు ఉన్న మీడియా సిబ్బందిపై కూడా దురుసుగా ప్రవర్తించారు. ఉదయం 8 తర్వాత పరిస్థితి కొంత మార్పు వచ్చింది.  మధ్యాహ్నం 2 గంటల తర్వాత రద్దీ పెరగడంతో పోలీసుల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఇలా రోజంతా ఆంక్షలతో భక్తులు, సిబ్బందిని ఇబ్బందుకలు గురిచేశారు.

మరిన్ని వార్తలు