ఆగని అన్వేషణ.. చిక్కని అదృశ్య హంతకుడు

17 Jul, 2014 08:45 IST|Sakshi
ఆగని అన్వేషణ.. చిక్కని అదృశ్య హంతకుడు
  •  చిక్కడు.. దొరకుడు..లాగా ఏటీఎం సైకో కిల్లర్
  •  18 కర్ణాటక, 12 ఆంధ్రా పోలీసు బృందాల గాలింపు
  • అనంతపురం క్రైం:దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరు ఏటీఎం కేసులో నిందితుడు దాదాపు ఎనిమిది నెలలుగా రెండు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఈ అదృశ్య హంతకుడి కోసం కర్ణాటకకు చెందిన 18, ఆంధ్రాకు చెందిన 12 పోలీసు బృందాల్లోని మొత్తం 500 మంది పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేశారని తెలుస్తోంది.

    గత ఏడాది నవంబర్ 19న బెంగళూరు నగరం నడిబొడ్డున పట్టపగలు ఓ ఏటీఎం కేంద్రంలో బ్యాంకు ఉద్యోగి జ్యోతి ఉదయ్‌పై కత్తితో  కిరాతకంగా దాడి చేశాడు. ఆమె వద్ద ఏటీఎం కార్డుతో పాటు సెల్‌ఫోన్‌ను అపహరించాడు. తర్వాత సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా  హిందూపురంలో అబుజర్ అనే యువకుడితో పాటు అతని సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా సైకో తమకు రూ.800కు సెల్‌ఫోన్‌ను విక్ర యించినట్లు వారు పోలీసులకు చెప్పారని తెలుస్తోంది.

    బెంగళూరు ఘటనకు మునుపే ‘అనంత’లోని ధర్మవరంలోని చంద్రబాబునగర్‌లో నవంబర్ 10న ప్రమీలమ్మ అనే వృద్ధురాలిని ఏటీఎం నిందితుడు హతమార్చి ఆమె ఏటీఎం కార్డును తీసుకుని ఉడాయించినట్లు కర్ణాటక పోలీసుల దర్యాప్తుల్లో వెల్లడైంది. ఆమె హత్యానంతరం నవంబర్ 12న కదిరి ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో ఉదయం 10.36కు రూ.3.400 డ్రా చేశాడు. తర్వాత సుమారు 20 నిమిషాల పాటు ఆ ఏటీఎంలోనే గడిపాడు.

    అక్కడి నుంచి నవంబర్ 19న బెంగళూరు వెళ్లి.. అక్కడ బ్యాంకు ఉద్యోగినిపై దాడి చేశాడు. అక్కడి సీసీ పుటేజీల్లో ఉన్న నిందితుడి ఫొటోలను ప్రింట్స్ వేసి ఆంధ్రలోని అన్ని పోలీసు స్టేషన్లు, ఏటీఎం కేంద్రాల వద్ద అతికించారు. అనంతరం దాదాపు 100 నుంచి 150 మంది అనుమానితుల్ని ప్రత్యేక పోలీసు బృందాలు విచారణ జరిపాయి.

     పట్టిస్తే రూ. 6 లక్షల నజరానా :
     
    ఏటీఎం నిందితుడిని పట్టిచ్చిన వారికి ఆంధ్రా పోలీసులు రూ.లక్ష,  బెంగళూరు పోలీసులు రూ.2 లక్షలు అప్పట్లో ప్రకటించారు. అయినా ఆచూకీ దొరక్క పోవడంతో కర్ణాటక పోలీసులు బహుమతిని రూ.5 లక్షలకు పెంచారు. ఈ క్రమంలో ఆంధ్ర-కర్ణాటక పోలీసులు వైఎస్సార్ జిల్లా, అనంతపురంతో పాటు జిల్లాలోని పెనుకొండ, హిందూపురం, ధర్మవరం, కదిరి పట్టణాలు, బెంగళూరు, తుంకూర్, ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో శోధించారు.

    దీంతో జిల్లాలోని నల్లచెరువు మండలం చెరువువాండ్లపల్లిలో పాత నేరస్తుడు నారాయణరెడ్డి కోసం వందల సంఖ్యలో ఇరు రాష్ట్రాల పోలీసులు వెళ్లి హంగామా చేశారు. 2008లో జరిగిన ఓ మహిళ హత్య, పలు దొంగతనాల కేసుల్లో అతను నిందితుడని పోలీసు రికార్డుల్లో నమోదైంది. కాగా అతను మానసిక వ్యాధిగ్రస్తుడని, మహిళలు కనిపిస్తే దాడులు చేస్తుంటాడని గ్రామస్తులు తెలిపారు.

    ఖమ్మం జిల్లా జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఇతని ఫొటోలను అక్కడి పోలీసులు అనంతపురానికి పంపారు. దీంతో వాటితో బెంగళూరు ఏటీఎం సీసీ కెమెరాల పుటేజీని పోలుస్తూ పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలేవీ చేయలేదు. పోలీసుల అన్వేషణ కొనసాగుతూనే ఉంది.
     

మరిన్ని వార్తలు