వేడుకలు.. వేర్వేరుగా

26 Dec, 2017 07:22 IST|Sakshi

బ్రిగేడ్‌ రోడ్డులో స్థల విభజన

మహిళలకు 30, పురుషులకు 70 శాతం చోటు

రెండు నిమిషాల లైట్స్‌ ఆఫ్‌కు స్వస్తి?

విభజించు.. సమస్యలను నివారించు అనే విధానాన్ని రాజధాని పోలీసులు నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు వినియోగిస్తున్నారు. ఏడాది చివరిరోజు రాత్రి ఉత్సవాల్లో మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా స్థలం కేటాయింపులతో అనేక సమస్యలు దూరమవుతాయని భావిస్తున్నారు.

సాక్షి, బెంగళూరు: ఐటీ సిటీలో 31న సాయంత్రం నుంచి నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి వీలుగా నగర పోలీసులు వినూత్న భద్రతా విధానాలు అమలు చేయనున్నారు. సంబరాలు జరిగే ప్రాంతాల్లో పురుషులకు, మహిళలకు వేర్వేరు ప్రాంతాలను కేటాయించబోతున్నారు. నగరంలో ఇలాంటి పద్ధతి ఇదే ప్రథమం. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా మహిళలపై మద్యం, డ్రగ్స్‌ మత్తులో కొందరు దుండగులు మహిళలపై కీచక పర్వాలకు దిగడం

వేడుకలు.. వేర్వేరుగా
తీవ్ర దుమారం రేపడం తెలిసిందే. దీంతో గత రెండువారాలుగా అటువంటి దురాగతాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల పై అన్ని వర్గాల ప్రజలతో ప్రజలు చర్చలు జరుపుతున్నారు.
వేడుక వేళ భద్రతా చర్యల్లో భాగంగా ఎంజీ, బ్రిగేడ్‌ రోడ్లలో 30 శాతాన్ని కేవలం మహిళల కోసం కేటాయించనున్నారు. ఇక్కడకు ఎట్టి పరిస్థితుల్లోనూ పురుషులను అనుమతించరు.
అదే విధంగా 70 శాతం రోడ్డును పురుషులకు కేటాయిస్తారు. ఇక్కడ పురుషులతో పాటు మహిళలకూ ప్రవేశం ఉంటుంది. దంపతులు, స్నేహితులు తదితరులు ఇక్కడకు వచ్చి వేడుకల్లో పాల్గొనవచ్చు.
అయితే ఉత్సవాలు అంటేనే అందరూ కలిసి చేసుకోవడమని ఇలా మహిళలు, పురుషులంటూ వేరు చేయడం సరికాదని కొంతమంది వాదిస్తున్నారు.
ఈ పద్ధతి వల్ల మహిళలు భయాందోళనలు లేకుండా సంతోషంగా వేడుకలను ఎంజాయ్‌ చేయవచ్చునని పోలీసులు చెబుతున్నారు.

2 నిమిషాల చీకటికి స్వస్తి?
న్యూ ఇయర్‌ వేడుకల పై నిఘా వహించడానికి వీలుగా నగర పోలీసులు దాదాపు 8,500 మంది పోలీసులతో పాటు 200 ఫోకస్‌ లైట్లు...500 సీసీ కెమెరాలను భద్రతా పర్యవేక్షణకు వినియోగించనున్నారు.
ముఖ్యంగా అర్ధరాత్రి 11:58 నుంచి 12 గంటల వరకూ అంటే రెండు నిమిషాల పాటు ఎం.జీ రోడ్డు, బ్రిగెడ్‌ రోడ్డుల్లో లైట్లను ఆఫ్‌ చేసే విధానాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో గందరగోళాలు చెలరేగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
కెమెరాలు, లైట్ల ఏర్పాటు ద్వారా ప్రతి ఒక్కరి పై నిఘా ఉంచడానికి వీలవుతుందనేది పోలీసుల ఆలోచన.

త్వరలో స్పష్టమైన ప్రకటన
ఇదిలా ఉండగా ఎం.జీ రోడ్, బ్రిగెడ్‌ రోడ్డుల వద్ద వ్యాపారులతో ఇప్పటికే 12 సార్లు సమీక్ష సమావేశాలు జరిపిన నగర పోలీసులు మరో రెండుసార్లు ఈ విషయం పై చర్చలు జరపనున్నారు. తర్వాత వేడుకల విషయంలో తీసుకునే జాగ్రత్తలు, ఇందుకు ప్రజలు సహకరించాల్సిన విధానం పై కూడా అధికారికంగా ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు