పోలీస్ బాస్‌లు ఎవరు..?

23 Sep, 2016 11:56 IST|Sakshi
 కొత్త జిల్లాల్లో ఎస్పీల పోస్టింగ్‌లపై జోరుగా చర్చ
 తెరపైకి పలువురి పేర్లు
 కొమురంభీంకు దుగ్గల్..?
 ఆదిలాబాద్‌కు విజయ్‌కుమార్..?
 దృష్టంతా కొమురంభీం జిల్లాపైనే
 ప్రజాప్రతినిధుల రంగ ప్రవేశం
 అనుకూల ఎస్పీని తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు..!
  
సాక్షి, మంచిర్యాల : త్వరలోనే కొలువుదీరనున్న కొత్త జిల్లాల్లో ఎస్పీలు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. అడవుల జిల్లా ఆదిలాబాద్.. నిర్మల్.. కొమురంభీం జిల్లాలుగా విభజింపబడుతోంది. దీంతో ఆయా జిల్లాల్లో కొత్త ఎస్పీల నియామకాలు అనివార్యమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఐపీఎస్‌ల కొరత ఉండడం.. కొత్త జిల్లాల్లోనూ ఈ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండడంతో ప్రభుత్వం ఏఎస్పీలకు జిల్లా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం అన్ని జిల్లాల నుంచి ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్పీలు.. ఏఎస్పీలకు సంబంధించిన వివరాలు.. ప్రతిపాదనలు డీజీపీకి అందాయి. పనితీరే ప్రామాణికంగా పలువురు ఏఎస్పీలకు కొత్త జిల్లాల్లో అవకాశం కల్పించేందుకు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కసరత్తు పూర్తయ్యింది. సీనియా ర్టీ.. పర్యవేక్షణ.. కేసుల దర్యాప్తు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇవ్వనుంది. 
 
మంచిర్యాలలో హాట్ టాపిక్
మరోపక్క.. కొత్త జిల్లాల ఏర్పాటుకు గడువు సమీపిస్తున్న కొద్దీ జిల్లాల్లో పోలీస్ బాస్‌లు ఎవరుంటారోనని పోలీసులు.. ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మంచిర్యాలలో ఈ చర్చ హాట్‌టాపిక్‌గా మారింది. కార్మిక క్షేత్రమైన కొమురంభీం జిల్లా నేరాలకు కేరాఫ్‌గా ఉండడం.. మహారాష్ట్ర-తెలంగాణకు సరిహద్దు ప్రాంతంలో ఉండడం.. బొగ్గు.. ఇసుక.. రియల్ మాఫియా..కలప స్మగ్లింగ్‌తోపాటు ఎక్కువగా దొంగతనాలు జరుగుతుండడంతో సీనియర్ ఐపీఎస్ అధికారిని ఈ ప్రాంతానికి ఎస్పీగా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రస్తుత జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ కొమురంభీం జిల్లాకు వస్తారని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే ఇటీవల మంచిర్యాల ఏఎస్పీ ఎస్‌ఎం విజయ్‌కుమార్ ఓఎస్డీగా జిల్లా కేంద్రానికి బదిలీపై వెళ్లారు. ఈయన్ను ఆదిలాబాద్ ఎస్పీగా నియమించే అవకాశాలున్నాయని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. నిర్మల్ ఎస్పీ నియామకం విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మొన్నటి వరకు జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్పీ రాధికను నిర్మల్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కాని.. ఆ స్థానంలో మరో కొత్త అధికారిని నియమించే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం.
 
అనుకూల ఎస్పీ కోసం ప్రయత్నాలు..? 
కొమురంభీం జిల్లా ఎస్పీ నియామకం విషయంలో ఈ ప్రాంతానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు.. రియల్టర్లు రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు.. అక్రమ రియల్ వ్యాపారులు.. పోలీసుల మధ్య అవగాహన ఉంది. గతంలో ఓ యువనేతకు సన్నిహితుడిగా పేరొందిన రియల్టర్ నస్పూర్‌లోని అసైన్డ్‌భూమిని కబ్జా చేసే యత్నం చేశాడు. దీనిపై పట్టణంలో జోరుగా చర్చ సాగడం.. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అధికారులు ఆ రియల్టర్ అక్రమాన్ని అడ్డుకున్నారు. పలు చోట్ల అయితే ప్రజాప్రతినిధులే రియల్ వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు.
 
ప్రస్తుతం ఈ ప్రాంతం భూ కబ్జాలు.. సెటిల్‌మెంట్లకు కేరాఫ్‌గా మారింది. సాక్షాత్తు రెవెన్యూ అధికారులు రియల్టర్లకు వత్తాసు పలుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజాయితీ.. కఠినంగా పనిచేసే అధికారి వస్తే తమ వ్యాపారానికి ప్రమాదమని భావించిన పలువురు ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా ఉండే అధికారిని కొత్త ఎస్పీగా తీసుకొచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే.. ఏడాదిన్నర కాలం మంచిర్యాల ఏఎస్పీగా పని చేసిన విజయ్‌కుమార్ డివిజన్  పరిధిలో అనేక అక్రమార్కులపై కొరడా ఝుళిపించారు. భూ కబ్జాలు.. సెటిల్‌మెంట్లకు దిగిన పలువురు నేతల దూకుడుకు కళ్లెం వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కొమురంభీం జిల్లాకు ఎలాంటి ఎస్పీ వస్తారోననే చర్చ హాట్‌టాపిక్‌గా మారింది.
>
మరిన్ని వార్తలు