14 కిలోల బంగారం స్వాధీనం

25 Jul, 2017 19:33 IST|Sakshi
14 కిలోల బంగారం స్వాధీనం

చెన్నై: తమిళనాడులోని కోవైలో అక్రమంగా తరలిస్తున్న బంగారం భారీగా పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఇన్‌కంటాక్స్‌ అధికారులు, పోలీసులతో కలిసి కోవై సమీపం సూలూరు ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న కారులో వారు సోదాలు జరపగా సీటు అడుగు భాగంలో ఉన్న బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. ఒక్కోటి వంద గ్రాముల బరువుగల 100 బంగారు బిస్కెట్లు ఉన్నట్లు తేలింది.

ఆ కారులో ఉన్న ఇద్దరు కోవైకి చెందిన మాధవన్‌ (39), సంపత్‌కుమార్‌ (51)గా తెలిసింది. వీరిచ్చిన సమాచారం ప్రకారం కోవై పెరియ దుకాణ వీధిలోని వారి సొంత దుకాణాలలో ఉన్న మరో నాలుగు కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 14 కిలోల బంగారు బిస్కెట్లు విలువ రూ.4 కోట్లు13 లక్షలు. ఈ బంగారు బిస్కెట్లు శ్రీలంక నుంచి పడవల ద్వారా తూత్తుకుడికి అక్రమంగా రవాణా చేసి కారులో కోవైకి తరలిస్తున్నట్లు తెలిసింది. అనంతరం అధికారులు మాధవన్, సంపత్‌కుమార్‌తో సహా వీరితో పని చేసిన ఎస్‌.రాజ్‌కుమార్‌ ఈ ముగ్గురిని అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు