పోలీస్ స్టేషన్‌పై రాళ్ల దాడి

5 Jul, 2015 03:14 IST|Sakshi
పోలీస్ స్టేషన్‌పై రాళ్ల దాడి

♦ ఫ్లైఓవర్ కింది జాలీలు తొలగించిన ఎమ్మెల్యే రమేశ్ కదం
♦ ఎమ్మెల్యేపై కేసు నమోదు.. పోలీస్టేషన్ ఎదుట కార్యకర్తల ఆందోళన
♦ పోలీసులపై రాళ్లతో దాడి, లాఠీ చార్జ్

 
 షోలాపూర్ : ఎన్సీపీకి చెందిన మొహల్ ఎమ్మెల్యే రమేష్ కదంపై పోలీసులు కేసు నమోదు చేయడంతో పార్టీ కార్యకర్తలు శనివారం పోలీస్టేషన్‌పై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పరిసర ప్రాంతాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలో ఫ్లై ఓవర్ కింది భాగం ఆక్రమణలకు గురికాకుండా జాలీలను ఏర్పాటు చేశారు. దీంతో జాలీలను తొలగించాలని స్థానికులు ఎమ్మెల్యేకు విన్నవించారు. స్థానికుల అభ్యర్థన మేరకు జాలీలు తొలగించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేసినా కార్పొరేషన్ పట్టించుకోకపోవడంతో తానే చొరవతీసుకొని జాలీలు తొలగించేందుకు ప్రయత్నించారు.

దీంతో ఎమ్మెల్యే రమేష్ అతని కార్యకర్తలపై స్థానిక పోలీసులు కేసు నమోదు  చేశారు. పోలీసులు అరెస్టు చేయకముందే లొంగిపోవాలని నిర్ణయించుకున్న రమేశ్  ర్యాలీగా పోలీస్టేషన్‌కు బయలు దేరారు. ఎమ్మెల్యేతోపాటు కార్యకర్తలందరూ ఒక్కసారిగా స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి చేయడంతో కార్యకర్తలు గాయపడ్డారు. కాగా,  కలెక్టర్ తుకారాం ముండే చెప్పినందువల్లే పోలీసులు తనపై బోగస్ కేసులు పెట్టారనీ, కలెక్టర్ ఓ మానసిక రోగి అని, నియంతలా వ్యవహరిస్తున్నాడని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వుడు సిగ్మంటు ఎమ్మెల్యేనైనా తనను అంటరాని వాడిగా చూస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు