చిక్కుల్లో ‘కామరాజ్’

1 May, 2015 02:30 IST|Sakshi

సాక్షి, చెన్నై : తనను  మోసం చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఆర్ కామరాజ్‌కు చిక్కులు  ఎదురయ్యే  అవకాశాలు కన్పిస్తున్నాయి.విచారణకు కోర్టు ఆదేశించడంతో డీఎస్పీ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. తిరువారూర్ జిల్లా నీడామంగళం సమీపంలోని కీలై వలైకు చెందిన పీవీఎస్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. గతంలో చెన్నైలో ఆయన ఓ బంగ్లా కొనుగోలు చేశారు. అందులో అద్దెకు ఉన్న వాళ్లు ఖాళీ చేయక పోవడంతో అన్నాడీఎంకే నాయకుడు కామరాజ్ బంధువు రామకృష్ణన్‌ను ఆశ్రయించాడు. ఆయన ద్వారా కామరాజ్‌తో ఆ బంగ్లాలో ఉన్న వాళ్లను ఖాళీ చేయించాలని కోరుతూ ఒప్పందం కుదుర్చుకున్నారు.
 
 ఇందుకు గాను రూ. 30 లక్షలు చేతులు మారాయి. ఖాళీ చేసి బంగ్లా అప్పగిస్తానన్న కామరాజ్ అందుకు తగ్గ ప్రయత్నాలు చేయలేదు. అలాగే,  ఎన్నికల్లో విజయంతో ఆయన  మంత్రి అయ్యారు. తనకు ఆ  బంగ్లా ఖాళీ చేయించి ఇవ్వాలని లేని పక్షంలో తీసుకున్న రూ. 30 లక్షలు వెనక్కు ఇవ్వాలని పదే పదే మంత్రి చుట్టు తిరిగినా ఫలితం శూన్యం. ఇక, కామరాజ్ మంత్రి కావడంతో ఆయన దర్శనం కోసం పడిగాపులు గాచినా, చి వరకు కుమార్‌కు బెదిరింపులు ఎదురయ్యాయి. తనను కామరాజ్ మోసం చేశారని మన్నార్ కుడి పోలీసుల్ని ఆశ్రయించినా ఫలితం శూన్యం. వారు ఫిర్యాదు అందుకోకపోవడంతో మద్రాసు హైకోర్టును కుమార్ ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయ స్థాయం కుమార్‌కు భరోసా ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.
 
 కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని మన్నార్ కుడి డిఎస్పీని ఆదేశించింది. దీంతో విచారణకు డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందం గురువారం రంగంలోకి దిగింది. ఫిర్యాదు అందుకున్న ఈ బృందం కేసు నమోదు చేసే పనిలో పడింది.  కుమార్‌తో విచారణ ముగియగానే, ఇక మంత్రి కామరాజ్‌ను విచారించే అవకాశాలు ఉన్నాయి. కాగా, మంత్రులపై  ఏదేని అవినీతి  ఆరోపణలు వచ్చినా, ఫిర్యాదులు బయలు దేరినా, పోలీసు కేసులు ఎదురైనా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నెర్ర చేయడం సహజం. ఈ దృష్ట్యా, త్వరలో రాష్ట్ర క్యాబినెట్‌లో మార్పులు జరిగేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి.  ఇప్పటికే అగ్రి కృష్ణమూర్తి రూపంలో ఇరకాటంలో పడ్డ  సీఎం పన్నీరు సెల్వం ప్రభుత్వానికి, తాజాగా మరో మంత్రిపై ఆరోపణలు బయలు దేరి ఉండటం మరో శిరోభారమే.
 

మరిన్ని వార్తలు