అరెస్టులు ఆపండి!

7 Sep, 2013 03:56 IST|Sakshi

సాక్షి, ముంబై: ఇటీవల శక్తి మిల్లులో ఆవరణలో మహిళా జర్నలిస్టు పై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనతో తేరుకున్న నగర పోలీసులు అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా అరెస్టు చేసి పారేస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, బార్లపై తనిఖీలు,దాడులను ఉద్ధృతం చేశారు. మైదానాలు, ఫుట్‌పాత్‌లు, నిర్జన ప్రదేశాలు, రైలుపట్టాల వెంబడి తిష్టవేసిన మాదకద్రవ్యాల బానిసలు కనిపించిన వెంటనే బేడీలు వేస్తున్నారు. వీటితోపాటు ఆర్కెస్ట్రా బార్లపై దాడులు పెంచారు. అశ్లీల నృత్యాలు చేసే మహిళలను అదుపులోకి తీసుకోవడం మొదలుపెట్టారు. దీంతో పోలీసు స్టేషన్లలో లాకప్‌లు, జైలు కిక్కిరిసిపోతున్నాయి. ఇక దాడులు చేయడం మానుకోవాలని కోరుతూ ముంబై పోలీసులకు జైలు అధికారులు లేఖలు రాసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే అన్ని జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలున్నారు. దీనికి తోడు తాజాగా ప్రతినిత్యం వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్న ఆకతాయిలు, మాదకద్రవ్యాల బానిసలను జైళ్లకు పంపిస్తున్నారు. వీరందరికీ ఎక్కడ వసతి కల్పించాలో తెలియక జైలు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. శక్తిమిల్లులో మహిళా ఫొటోగ్రాఫర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడింది ఆకతాయిలు, వ్యసనపరులే కావడంతో వీరిపైనే పోలీసులు అధికంగా దృష్టి సారించారు.
 
అత్యాచారాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారంటూ సామాజిక సంఘాలు, విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేయడంతో దొరికినవారిని దొరికినట్లే అదుపులోకి తీసుకుని కోర్టులకు తరలిస్తున్నారు. అందుకే ఏ స్టేషన్‌లో చూసినా లాకప్‌లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. డ్యాన్స్‌బార్లు ప్రారంభించేందుకు అత్యున్నత న్యాయస్థానం ఇటీవల అనుమతినిచ్చినప్పటికీ హోంశాఖ ఇంతవరకు అధికారికంగా ఏ ఒక్కరికీ లెసైన్సులు జారీచేయడం లేదు. ఇప్పటికే ఆర్కెస్ట్రా, లేడీస్ వెయిటర్స్ పేర్లతో మహిళా బార్‌టెండర్లను నియమించుకుంటున్నారు. అక్కడికి వచ్చే వారితో ఈ యువతులు అశ్లీలకృత్యాలు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. బార్లపై కూడా పోలీసులు దాడులు ఉద్ధృతం చేయడంతో పట్టుబడిన యువతలందరినీ మహిళల సంరక్షణ  ఆలయాలకు పంపిస్తున్నారు. వీటిలో కూడా జైళ్ల మాదిరిగా సామర్థ్యానికి మించిన ఖైదీలున్నారు. ఆకస్మాత్తుగా పెరిగిన రద్దీతో జైలు సిబ్బంది, అధికారులు ఆందోళనలో పడిపోయారు.
 
ఇక కొత్తగా వచ్చేవారికి బ్యారక్‌లలో చోటు లేదని జైలు అధికారులు అంటున్నారు. దీనిపై నగర పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ జైళ్లు, మహిళ వసతిగృహాలు కిటకిటలాడుతున్న విషయం వాస్తవమేనని అంగీకరించారు. రద్దీ గురించి ప్రశ్నించగా ‘అక్కడ ఉండేందుకు చోటులేదని నిందితులను గాలికి వదిలేస్తామా..? మా విధినిర్వహణలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నాం. వీటి ని నిలిపివేయడం సాధ్యపడదు’ అని అన్నారు. ఈ దాడులు కొనసాగుతూనే ఉంటాయని, లేకుంటే నేరాలు మరింత పెరిగిపోతాయని సింగ్ స్పష్టీకరించారు. ఇదిలా ఉంటే నేరాల నియంత్రణలో భాగంగా ఇక నుంచి పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు ఇంటి నుంచి యూనిఫారాల్లోనే విధులకు బయల్దేరాలని, ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు కూడా యూనిఫారాన్ని వేసుకునే కనిపించాలని సింగ్ ఆదేశించడం తెలిసిందే. ఈ కొత్త ఆదేశాల ఫలితంగా ఇక నుంచి ఎక్కడ చూసినా పోలీసులే దర్శనమిస్తారు. దీంతో చిల్లరదొంగలు, నేరస్తుల్లో దడపుట్టి నేరాలకు పాల్పడేందుకు కొంతమేర జంకుతారని సింగ్ అభిప్రాయపడ్డారు.
 
మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
షిర్డీ: గుర్తుతెలియని నలుగురు 32 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై అత్యాచారం జరిపారని స్థానిక పోలీసులు శుక్రవారం తెలిపారు. అహ్మద్‌నగర్ జిల్లా కోపర్‌గావ్ తాలుకాలోని జేవుర్ పటోటా గ్రామంలో గురువారం ఉదయం ఈ దారుణం జరిగింది. సోదరితోపాటు ఉంటున్న ఆమె బయటికి వెళ్లినసమయంలో దుండగులు పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపారు. మాటల ద్వారా వివరించడం ఆమెకు సాధ్యం కాకపోవడంతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. చికిత్స కోసం బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపులు మొదలుపెట్టామని పోలీసులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు