తిప్పలు తప్పవా?

6 Oct, 2013 02:29 IST|Sakshi

సాక్షి, ముంబై: గతంలో చేసిన పాపాలు కొందరు రాజకీయ నాయకులను నీడలా వెంటాడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం శిక్షపడిన అభ్యర్థులు ఎన్నికలకు అనర్హులంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించడమే. రాష్ట్రంలోని అనేకమంది నాయకులను ఈ తీర్పు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రానికి చెందిన దాదాపు 853 మంది నాయకులకు మున్ముందు ఇది ఇబ్బందికరంగా పరి ణమించే అవకాశముంది. ‘నేషనల్ ఎలక్షన్ వాచ్’ అనే సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం 2009 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన 3,530 మంది అభ్యర్థుల్లో 853 మందిపై అనేక కేసులున్నాయి. వీరిలో శివసేనపార్టీకి చెందినవారు అత్యధికంగా 153 మంది ఉన్నారు. ఎమ్మెన్నెస్‌కు చెందిన 82, బీజేపీకి చెందిన 69, కాంగ్రెస్‌కు చెందిన 57, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 47, ఎన్సీపీకి చెందిన 40 మందితోపాటు ఇతర పార్టీల వారుకూడా ఈ జాబితాలో ఉన్నారు.
 
 328 మంది అభ్యర్థులపై హత్య, హత్యాయత్నం, బలవంతపు వసూళ్లు, అపహరణ తదితర కేసులు ఉన్నాయి. శివసేనకు చెంది న 47, ఎమ్మెన్నెస్‌కు చెందిన 30, బీఎస్‌పీకి చెందిన 21, కాంగ్రెస్‌కు చెందిన 18, బీజేపీకి చెందిన 17, ఎన్సీపీకి చెందిన 15 మందిపై ఈ తరహా కేసులు ఉన్నాయి. అందువల్ల మున్ముందు జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీరికి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. బీజేపీకి చెందిన శివాజీ కార్డిలే, అతుల్ దేశ్కర్, సుధీర్ మునగంటివార్, సుధాకర్ దేశ్‌ముఖ్, రవీంద్ర చవాన్, ఎన్సీపీకి చెందిన బదామ్‌రావ్ పండిత్, లోక్‌సంగ్రామ్ పార్టీకి చెందిన అనీ ల్ గోటే, ఎమ్మెన్నెస్‌కు చెందిన శిశిర్ షిండే, బాలానందగావ్కర్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అబూ ఆజ్మీ, శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే, సంజయ్ రాథోడ్, సంజయ్ జాదవ్‌లతోపాటు పలువురు ప్రముఖులున్నారు. ఇక కేసులవారీగా పరిశీలించినట్టయితే శిశిర్ షిండేపై ఎనిమిది, శివాజీ కార్డిలేపై అయిదు ఉన్నాయి.
 
 మరోవైపు ఏక్‌నాథ్ షిండేపై 20, రాథోడ్‌పై 21, అబూ ఆజ్మీపై తొమ్మిది, సుధాకర్ దేశ్‌ముఖ్‌పై ఎనిమిది, బాలానందగావ్కర్‌పై అయిదు, రవీంద్ర చవాన్‌పై 18, సంజయ్ జాదవ్‌పై 17, అతుల్ దేశ్కర్‌పై మూడు, మునగంటివార్‌పై 28, బదామ్‌రావ్ పండిత్‌పై 10 కేసులున్నట్టు ఎలక్షన్ వాచ్ నివేదికతో తేలిపోయింది. అదే విధం గా ఎన్నికల కమిషన్‌కు అందించిన ప్రతిజ్ఞాపత్రాల్లో పేర్కొన్న వివరాల మేరకు 620 మందిపై అవినీతి కేసులు ఉండగా, మరో 20 మందిపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. నకిలీ స్టాంపుల కేసులో అనిల్ గోటేకి ఇప్పటికే జైలు శిక్షపడగా బెయిల్‌పై బయటికొచ్చారు. ఇంకా అనేకమంది నాయకులపై నమోదైన కేసులకు సంబంధించి త్వరలోనే తీర్పు వెలువడే అవకాశముంది. దీంతో తమపై కేసులు నమోదైన నాయకులంతా ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.
 
 ఈ తీర్పు నేపథ్యంలో త్వరలో జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించే ముందు ఆయా పార్టీలు వారి గురించి పూర్తిగా ఆరా తీసే అవకాశం కూడా ఉంది. జైలు శిక్షపడిన, శిక్ష పడే అవకాశమున్నవారికి సీట్లు ఇవ్వకుండా జాగ్రత్తపడాలని ఆయా పార్టీలు భావిస్తున్నట్టు రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు