చావుపై విపక్ష రాజకీయం

24 Mar, 2015 02:39 IST|Sakshi
చావుపై విపక్ష రాజకీయం

ఉభయ సభల్లో తీవ్ర వాగ్వాదానికి కారణమైన సీఎం వ్యాఖ్యలు
వాకౌట్ చేసిన శాసనసభ, మండలిలోని విపక్షాలు

 
బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఐఏఎస్ అధికారి డీ.కే రవి వృతికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఉభయసభల్లో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది. సీఎం వాఖ్యలను ఖండిస్తూ విపక్షాలు సభల నుంచి వాకౌట్ చేశాయి. శాసనసభలో సోమవారం కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే సభానాయకుడు, సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ...‘విపక్షాలు కోరుతున్నాయని మేము డీ.కే రవి మృతికి సంబంధించిన కేసును సీబీఐకు ఇవ్వడానికి అంగీకరించలేదు. రాష్ట్ర ప్రజలతో పాటు బాధిత కుంటుంబం కోరిక మేరకు కేసును సీబీఐకి అప్పగించాం. చావుకు సంబంధించిన విషయం కూడా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. అందులో భాగంగా డీ.కే రవి తల్లిదండ్రులను విధానసౌధలోనికి తీసుకువచ్చి వారితో నిరసన దీక్ష చేయించాయి. దీని వల్ల రాజకీయ ప్రయోజనం పొందాలనేదే వారి ఆలోచన.’ అని పేర్కొన్నారు. దీనికి శాసనసభలోని ప్రధాన విపక్ష భారతీయ జనతా పార్టీ నాయకుడు శెట్టర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే సీఎం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు మిగిలిన బీజేపీ నాయకులతో పాటు జేడీఎస్ తదితర విపక్ష నాయకులు తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా అధికార విపక్ష నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ వాగ్వాదాల నడుమే శెట్టర్ మాట్లాడుతూ...‘సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం అంగీకరించడం సరైన నిర్ణయమే. అయితే ఈ చర్యలను వారం ముందు తీసుకుని ఉంటే బాగుండేది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విపక్షాల గురించి నిర్లక్ష్య వ్యాఖ్యలు చేయడం సరి కాదు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెన క్కు తీసుకోవాలి.’ అని పునరుద్ఘాటించారు. ఈ సమయంలో స్పీకర్ కాగోడు తిమ్మప్ప కలుగజేసుకుని సభానాయకుడైన సీఎం సిద్ధరామయ్య సరిగానే మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోమని చెప్పలేను.’ అని పేర్కొన్నా రు. దీంతో బీజేపీ నాయకులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. వారికి మద్దతుగా జేడీఎస్ ఫ్లోర్ లీడర్ కుమారస్వామితో పాటు ఆ పార్టీకు చెందిన నాయకులందరూ శాసనసభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

దాదాపు ఇదే ‘సీన్’ శాసనమండలిలో కూడా కనిపించింది. ముఖ్యమంత్రి సిద్ధరామ య్య ప్రకటనపై విపక్షాలు చర్చకు పట్టుబటా యి. అంతేకుండా హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.  అయితే అందుకు మండలి నాయకుడు ఎస్.ఆర్ పాటిల్‌తోపాటు  శాసనమండలి అధ్యక్షుడు శంకరమూర్తి అంగీకరించక పోవడంతో బీజేపీ, ఎడీఎస్ ఎమ్మెల్సీలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ బయటికి వెళ్లిపోయారు.  
 
 

>
మరిన్ని వార్తలు